Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Srisailam Ghat Road Traffic

Srisailam Ghat Road Traffic

Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు పెద్ద సంఖ్యలో సొంత వాహనాల్లో శ్రీశైలానికి చేరుకుంటుండటంతో రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక, సాక్షిగణపతి నుంచి హఠకేశ్వరం వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే శ్రీశైలం ముఖద్వారం నుంచి సుంన్నిపెంట వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దర్శనానికి రెండు గంటల సమయం
మరోవైపు శ్రీశైలం క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి కూడా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రస్తుతం స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులకు సుమారు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వరుస సెలవులు కావడంతో రాబోయే గంటల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఘాట్‌ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ, భారీగా తరలివచ్చిన వాహనాలతో రద్దీ కొనసాగుతోంది.

ఇక, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కృష్ణానదిలో కొంత వరకు వరద పెరిగినా.. ఇప్పటి వరకు శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయిలో నిండింది లేదు.. గత ఏడాది ఈ సమయం వరకే శ్రీశైలం గేట్లు ఎత్తివేయడంతో పర్యాటకులు.. భక్తులు సందడి కనిపించగా.. 20 రోజుల క్రితం కూడా నీరు లేని శ్రీశైలం డ్యామ్‌కు ఆ తర్వాత ఇన్‌ఫ్లో కాస్త పెరగడంతో.. ఓ స్థాయి వరకు నీటిమట్టం చేరుకుంది.. అయితే, శ్రీశైలం జలాశయానికి వరద తగ్గిపోయింది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 878 అడుగుల వరకు చేరుకోగా.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది..