Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు

Nandyal Bus Accident

Nandyal Bus Accident

Nandyal Bus Accident: హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై ప్రతి రోజూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది.. ఇక, ఇవాళ నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న జగన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆళ్ళగడ్డ హైవేపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తున్న బర్రెలను తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా, బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలో పడిపోయి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొంతమంది అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.