Site icon NTV Telugu

Nadendla Manohar: ఆరు వేల కోట్లు స్వాహా.. వాటి లెక్కలెక్కడ?

Nadendla Manohar On Sdc

Nadendla Manohar On Sdc

Nadendla Manohar Reveals Secrets Of SDC: రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ ద్వారా అభివృద్ధి చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం.. ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎస్డీసీ ద్వారా తెచ్చిన రుణాల్లో సుమారు రూ. 6 వేల కోట్లు పక్కకు మళ్లించారని ఆరోపించిన ఆయన.. ఆ అప్పుల వినియోగం లెక్కలెక్కడ? అని నిలదీశారు. 2020లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ సీబీఐ దత్తపుత్రుడు (సీఎం జగన్‌ని ఉద్దేశించి) ఏపీ అభివృద్ధి కార్పోరేషన్ (ఎస్‌డీసీ) మొదలుపెట్టారని.. ఏర్పాటు విషయంలోనే దీనికి కేంద్రం అభ్యంతరం తెలిపిందన్నారు. మాజీ సీజేఐ ద్వారా ఎస్‌డీసీకి చట్టబద్దత ఉందని కేంద్రాన్ని మభ్య పెట్టేలా చెప్పించారని.. అది రాజ్యాంగ విరుద్ధమని పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన చేసిందని గుర్తు చేశారు. ఎస్‌డీసీకి రుణాలు ఇవ్వొద్దని బ్యాంకర్లను కేంద్రం హెచ్చరించిందని కూడా తెలిపారు.

అయితే.. కేంద్రం ఆ ప్రకటన చేసేలోపే ఏపీ ప్రభుత్వం రూ. 23 వేల కోట్లను ఎస్‌డీసీ ద్వారా అప్పులు చేసిందని నాదెండ్ల పేర్కొన్నారు. అందులో నుంచి అమ్మఒడి, చేయూత, ఆసరా కోసమంటూ రూ. 17 వేల కోట్లకు పైగా మొత్తాన్ని వాడేశారన్నారు. మిగిలిన ఆరు వేల కోట్ల లెక్కలు మాత్రం లేవన్నారు. మద్యం ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ. 25 వేల కోట్లు ఆదాయం వస్తోందని.. చేసిన అప్పులతో పాటు వస్తోన్న ఆయాన్ని ఏం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎస్‌డీసీని కేవలం అప్పులకే పరిమితం చేశారన్నారు. ఏపీలో జరుగుతోన్న ఆర్ధిక అవకతవకలపై కేంద్రం స్పందించడంతో పాటు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ ఒత్తిడి ఫలించిందని, అందుకే దాని ప్రైవేటీకరణ అంశం నెమ్మదించిందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Exit mobile version