Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు

  • మురసుగా మారిన తీవ్ర వాయుగుండం
  • నవంబర్ 2న తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
  • నెల్లూరు-నర్సాపురం మధ్య తీరం దాటే సూచనలు
  • మత్స్యకారులకు హెచ్చరికలు.. తీర జిల్లాల్లో అప్రమత్తత
Murasu

Murasu

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చి ‘మురసు’ తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుండటంతో దక్షిణ కోస్తాంధ్రతో పాటు ఉత్తర తమిళనాడు తీరప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ ధాటికి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

తీరానికి చేరువగా ‘మురసు’.. వేగంగా కదులుతున్న రాక్షస గాలులు

ఆదివారం ఉదయం 11:30 గంటల సమయానికి ఈ తుఫాన్ నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 560 కి.మీ, నెల్లూరుకు 630 కి.మీ, మచిలీపట్నానికి 640 కి.మీ, విశాఖపట్నానికి 660 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత ఆరు గంటలుగా గంటకు 23 కిలోమీటర్ల వేగంతో ఇది పశ్చిమ వాయవ్య దిశగా అడుగులు వేస్తోంది.

నవంబర్ 2న తీవ్ర తుఫాన్‌గా.. గంటకు 120 కిమీ వేగంతో విలయం

ఐఎండీ అంచనాల ప్రకారం.. ‘మురసు’ తుఫాన్ రాబోయే 24 గంటల్లో మరింత బలపడి నవంబర్ 2వ తేదీ ఉదయం నాటికి ‘తీవ్ర తుఫాన్’ (Severe Cyclonic Storm)గా మారనుంది. అనంతరం వాయవ్య దిశగా పయనిస్తూ నవంబర్ 2వ తేదీ రాత్రి 11:30 గంటల నుంచి తెల్లవారుజాము 4:00 గంటల మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది. ముఖ్యంగా నెల్లూరు-నర్సాపురం మధ్యలో ఇది తీరం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తీరం దాటే సమయానికి గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీచే ప్రమాదం ఉంద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తీరప్రాంత జిల్లాల్లో హైఅలర్ట్.. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ఆదేశాలు

పరిస్థితి తీవ్రతను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని ముందస్తుగా అప్రమత్తం చేసింది. ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తక్షణమే సమీప తీరాలకు తిరిగి రావాలని అత్యవసర సూచనలు జారీ చేశారు.