NTV Telugu Site icon

Mla Tulabharam: బూరెలతో తులాభారం.. ఎమ్మెల్యే రూటే సపరేటు

Mla1

Mla1

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. గతంలో అల్లుడికి భారీస్థాయిలో సారె పంపిన కథ విన్నాం, చూశాం. అదే అల్లుడి అత్తగారికి కూడా తమ తరఫున ఆషాడం సారె పంపారు. వందల కిలోల స్వీట్లు, హాట్లు… అరటిపళ్ళు….ఇలా ఎందులోనూ తగ్గేది లేదని రెండు కుటుంబాల వారు తమ విలక్షణత చాటుకున్నారు. ఓ ఎమ్మెల్యే తులాభారం గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి బూర్లతో తులాభారం తూగారు. అదేదో డబ్బులు, బంగారం, వెండి, బెల్లంతో కాదు. ఏకంగా బూర్లతో ఆయన తూగిన తులాభారం చూడడానికి రెండు కళ్ళు చాలలేదంటున్నారు జనం.

బూర్లు అంటే పండుగ సమయాల్లో అందరూ చేసుకొని తినే బూర్లతోనే అమ్మవారికి ఆయన మొక్కు తీర్చుకున్నారు. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎరుబండి రమేష్ శాసనసభ్యులుగా చిర్ల జగ్గిరెడ్డి మళ్ళీ గెలుపొందితే బూరెలతో తులాభారం వేయిస్తామని అమ్మవారికి మొక్కుకున్నాడు. బడుగువానిలంక కొండాలమ్మ అమ్మవారికి మొక్కుకున్న ఆ మొక్కును తీర్చుకున్నాడు.

ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అభిమాని కోరికను కాదనకుండా అతని మొక్కును చెల్లించుకున్నారు. సుమారు 125 కేజీలతో తొమ్మిదివేల బూర్లను అమ్మవారికి మొక్కుగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో ఎప్పటినుంచో ఈ సంప్రదాయం వుందని, దానిని పాటించడం తమ కర్తవ్యం అంటున్నారు గ్రామస్తులు. ఈ బూరెల తులాభారం వైరల్ అవుతోంది.