Site icon NTV Telugu

MLA Hafeez Khan: దమ్ముంటే అక్కడి నుంచి పోటీ చెయ్ అంటూ పవన్‌కి సవాల్

Mla Hafeez Khan Dares Pawan Kalyan

Mla Hafeez Khan Dares Pawan Kalyan

కర్నూలులో రైతు భరోసా యాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గుప్పించిన విమర్శలకు గాను, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆయనపై ధ్వజమెత్తారు. దమ్ముంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని పవన్‌కి సవాల్ విసిరారు. కర్నూలు పాతబస్తీలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన హఫీజ్ ఖాన్.. రెండు చోట్ల పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూసిన పవన్‌కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదన్నారు. కేవలం తన ఉనికిని కాపాడుకోవడం కోసమే పవన్ ఈ పర్యటనలు చేస్తున్నారని, నిజంగా ఆయనకు ప్రజాబలం ఉంటే కర్నూలులో పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.

కర్నూలులో పోటీ చేస్తే.. గోదావరి జిల్లాల కన్నా ఇక్కడ ఘోరంగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హఫీజ్ ఖాన్ వెల్లడించారు. ఆయన చేస్తోన్న పర్యటనలు ప్రజా మేలు కోసం కాదని, చంద్రబాబు మెప్పు పొందేందుకు ఆయన రాసిన స్క్రిప్టును చదువుతూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ఇచ్చిన హామీల్లో 95 శాతానికి పైగా సీఎం జగన్ అమలు చేశారని.. అందులో అత్యధిక శాతం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు మేలు చేసేవి ఉన్నాయని చెప్పారు. పవన్‌ ఓవైపు బీజేపీతో కాపురం చేస్తూనే, మరోవైపు టీడీపీతో జత కట్టేందుకు తహతహలాడుతున్నారని ఆరోపించారు. కర్నూలులో రైతు భరోసా యాత్ర చేపట్టిన పవన్.. రైతుల గురించి కాకుండా, గతంలో చంద్రబాబు కర్నూలుకు ఇచ్చిన హామీలపై మాట్లాడి ఉంటే, ప్రజలు వినేందుకు బాగుండేదని అన్నారు.

రైతుల శ్రేయస్సు కోరి, జగన్ సర్కార్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాయని.. ఇన్‌పుట్‌ సబ్సిడీ, రుణాల పంపిణీ, విత్తన సరఫరాతో పాటు ఎన్నో రకాల మేలు జరుగుతోందని హఫీజ్ ఖాన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని ఎత్తులు వేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. కచ్ఛితంగా తిరిగి తమ పార్టీని ఎన్నికల్లో గెలుస్తుందని, సీఎం కుర్చీలో జగనే కూర్చుంటారని హఫీజ్ నమ్మకం వెలిబుచ్చారు.

Exit mobile version