Site icon NTV Telugu

ప్రొద్దుటూరు వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు రాజుకుంటూనే వున్నాయి. అనుచరుడిగా ఉంటారని ఆ ఎమ్మెల్యే కోరి తెచ్చుకున్న వ్యక్తి ఆయనకే కొరగాని కొయ్యగా మారిపోయాడు. మారిన పరిణామాలతో ఆ అనుచరుడికి ఊహించని పదవి వచ్చింది. దీంతో అధికారపార్టీలో వర్గవిభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. అధిష్ఠానానికి తలనొప్పులు వచ్చిపడుతున్నాయి.

రాచమల్లు, రమేష్‌ మధ్య మలుపులు తిరుగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఆవిర్భావంతో లోకల్‌ పాలిటిక్స్‌ మారిపోయాయి. అప్పటిదాకా పోటీ టీడీపీ, కాంగ్రెస్ మధ్య ఉండేది. ఆ తర్వాత పోరు వైసీపీ, టీడీపీగా మారిపోయింది. ప్రస్తుతం వైసీపీదే హవా. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఒకసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. అలాంటి ప్రొద్దుటూర్‌లో మున్సిపల్‌ ఎన్నికలు ఎమ్మెల్యేకు ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. ఆ ఎన్నికల్లో యాదవ సామాజికవర్గానికి చెందిన మాజీ మున్సిపల్‌ ఛైర్మన్ వెంకట సుబ్బయ్య కుమారుడు రమేష్ యాదవ్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన కౌన్సిలర్‌గా గెలిచారు. కానీ.. ఛైర్మన్‌గా రమేష్‌ యాదవ్‌ పేరును ప్రకటించలేదు.

అయితే అక్కడే ట్విస్ట్. బీసీ సామాజికవర్గంలో చేనేత వర్గానికి చెందిన లక్ష్మీదేవిని ఛైర్‌పర్సన్‌ను చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రాచమల్లు, రమేష్‌ యాదవ్‌ మధ్య మొదలైన రగడ అనేక మలుపులు తిరుగుతోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో తాను ఖర్చు పెట్టిన 5 కోట్లు తిరిగి ఇవ్వాలని రమేష్‌ గొడవ చేశారు. దాంతో రమేష్‌కు రాష్ట్రస్థాయి పదవి ఇప్పిస్తానని ఎమ్మెల్యే రాచమల్లు బహిరంగంగా ప్రకటించారు. యాదవ సామాజికవర్గంపై తనకు ఎనలేని ప్రేమ ఉందని చెప్పారు. ఎవరూ ఊహించని రీతిలో రమేష్‌ యాదవ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీని చేశారు సీఎం జగన్‌. వైసీపీలో ఇదో సంచలనం. ఎమ్మెల్సీ పదవి తన పలుకుబడితోనే వచ్చిందని ఎమ్మెల్యే రాచమల్లు చెప్పుకున్నా దానిని ఎవరూ పట్టించుకోలేదు.

ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్సీ రమేష్‌ను చంపుతామని.. టీడీపీ నేత నందం సుబ్బయ్యకు పట్టిన గతే పడుతుందని ఫోన్‌లో బెదిరించారు. ఈ బెదిరింపుల వెనక ఎమ్మెల్యే రాచమల్లు హస్తం ఉందని ప్రచారం జరిగింది. అయితే వాటిని ఎమ్మెల్యే ఖండించారు. ఫోన్‌లో బెదిరించిన వాళ్లను పట్టుకుని నడిరోడ్డులో ఊరేగించాలని ఎస్పీకి ఫోన్‌ చేసి చెప్పారు రాచమల్లు. ఫోన్‌ బెదిరింపులపై కేసు నమోదైనా.. ఏమైందో ఎవరికీ తెలియదు.

అధిష్టానం సూచనలతో ప్రొద్దుటూరు రాజకీయాలను రాచమల్లుకే వదిలి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో తిరుగుతూ వస్తున్నారు ఎమ్మెల్సీ రమేష్‌. పార్టీ అధిష్ఠానం కూడా ఎమ్మెల్సీకి అండగా ఉందని టాక్‌ నడిచింది. బద్వేల్‌ ఉపఎన్నిక, కమలాపురం మున్సిపల్ ఎన్నికలు ఎమ్మెల్సీని పార్టీకి మరింత దగ్గర చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ పరిణామాలు.. ప్రచారం ఎమ్మెల్యే రాచమల్లు, ఎమ్మెల్సీ రమేష్ మధ్య ఇంకా గ్యాప్‌ తీసుకొచ్చాయి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీకి ప్రొటోకాల్‌ దక్కకుండా అడ్డుకోవడంపై వివాదం రాజుకుంది. అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాచమల్లు ఫొటోలతో సమానంగా ఎమ్మెల్సీ రమేష్‌ ఫొటో, పేర్లు కనిపించడంలేదు.

ఎమ్మెల్సీ బర్త్‌డే వేడుకల సందర్భంగా వేసిన ఫ్లెక్సీల్లో సీఎం, ఎంపీ ఫొటోలు తప్ప ఎమ్మెల్యే ఫొటోలు లేవు. దీంతో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కసిరెడ్డి మహేష్‌రెడ్డి ఎమ్మెల్సీ వర్గీయులతో గొడవ పడ్డారు. భౌతికదాడులకు దిగారు. తనను చంపుతానని ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ గన్‌ గురిపెట్టారని వైసీపీ కౌన్సిలర్‌ లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. ఈ వివాదాన్ని ఎలా తేల్చాలో తెలియక పార్టీ పెద్దలు ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా 2024లో వైసీపీ టికెట్‌ బీసీలకు ఇస్తారన్న ప్రచారం ఎమ్మెల్యే వర్గానికి మింగుడుపడడం లేదు.

Exit mobile version