NTV Telugu Site icon

Global Investors Summit 2023: సహజ, మానవ వనరులకు కొదవలేదు.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి..

Global Investors Summit

Global Investors Summit

Global Investors Summit 2023: ‘నైపుణ్యం కలిగిన మానవ వనరులకు, సహజ వనరులకు కొదవలేదు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండి అంటూ పారిశ్రామిక దిగ్గజాలకు స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు.. రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్‌ జగన్‌ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్‌ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్‌ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్‌ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం… పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ, హెల్త్‌కేర్‌ అండ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్‌ అండ్‌ ఇన్నోవేషన్స్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్, ఆటోమొబైల్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, అగ్రి అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్‌ అండ్‌ అప్పరెల్స్, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్, పెట్రోలియం అండ్‌ పెట్రోకెమికల్స్‌ తదితర రంగాలపై ఫోకస్‌ పెట్టింది..

Read Also: GSI 2023: అతిథుల కోసం ప్రత్యేక వంటకాలు.. ఘుమ ఘుమ లాడే ఆంధ్ర రుచులు

దీని కోసం విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ సమ్మిట్‌కు 45కు దేశాలకు పైగా ప్రతినిధులు, భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.. జీఐఎస్‌ వేదికగా వారికి ఏపీతో ఉన్న అనుసంబంధాన్ని పంచుకున్నారు.. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023కు హాజరవుతున్న ఆహుతులకు సాంప్రదాయ నృత్యరూపకాలతో ఆత్మీయ స్వాగతం పలికారు కళాకారులు. పలువురు డెలిగేట్స్‌ ను ఆత్మీయంగా పలకరిస్తున్న సీఎం జగన్‌. జీఐఎస్‌లో ఏపీ రాష్ట్ర గీతం ‘మా తెలుగు తల్లికి’ ఆలాపన చేశారు.. జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించిరు సీఎం జగన్‌.. దీంతో.. విశాఖలో జీఐఎస్‌ ఘనంగా ప్రారంభమైంది.. ఇక, ఈ సందర్బంగా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, అవకాశాలపై మంత్రులు కీలక ప్రసంగం చేశారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్‌ సారధ్యంలో బలమైన నాయకత్వం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉందన్నారు.. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలు రంగాల్లో లాజిస్టిక్స్‌ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. బిజినెస్‌ ఇండస్ట్రీపై సీఎం జగన్‌ మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా ఉంది. ఇండియా ఇండస్ట్రీయల్‌ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోందని వెల్లడించారు.

ఇక, భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ప్రపంచానికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోందని కొనియాడారు.. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి.. వాటిని సమర్ధవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధికి ఏపీ చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు.. ఈ సందర్భంగా సియాంట్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. విశాఖలో మరిన్ని సేవలు విస్తరిస్తాం అని ప్రకటించారు.. ఏపీలో సంక్షేమ పథకాలు అద్భుతమని కొనియాడిన ఆయన.. ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం అన్నారు.. విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం అని ప్రశంసించారు.. పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది.. అమ్మఒడి, విద్యాకానుక, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవనె పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ విజన్‌ అద్భుతంగా ఉందన్నారు.. సీఎ జగన్‌ దార్శనికత ప్రశంసనీయమన్న ఆయన.. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది.. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.. ఏపీలో ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ ఉందన్న ఆయన.. ఎయిర్‌ కనెక్టివిటీ పెరుగుతండటంతో ఏపీకి మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు.. రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయమని కొనియాడారు జీఎంఆర్..