NTV Telugu Site icon

Minister Taneti Vanita: రేప్ కేసుల్లో ఎక్కువ మంది నిందితులు టీడీపీ వాళ్లే

Taneti Vanita

Taneti Vanita

బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. ఏపీలో జరుగుతున్న హత్యలు, అత్యాచార ఘటనల్లో ఎక్కువశాతం నిందితులు టీడీపీ వాళ్లే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఏపీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఈ ఘటన సమయంలో భర్తపై దాడి చేస్తున్న బాధ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె వివరించారు.

మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను తక్షణమే అరెస్ట్ చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు. బాధ్యులపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే ఊహించని ఘటన కారణంగా ప్రస్తుతం మహిళ షాక్‌లో ఉందని పేర్కొన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అన్నిరకాల పరిహారాలు అందిస్తామన్నారు. అత్యాచార ఘటనలకు గురైన బాధితుల వివరాలు తెలిపే విషయంలో గోప్యత పాటించాలని మీడియాకు హితవు పలికారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

అటు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈ ఘటన రైల్వేస్టేషన్‌లో జరిగింది కాబట్టి రైల్వేస్టేషన్‌లలో భద్రత గురించి తాము కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. రాత్రిపూట రైల్వేస్టేషన్‌లలో నిద్రించే మహిళలకు భద్రత అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసును మూవ్ చేయడం జరిగిందని.. తద్వారా విచారణ మరింత వేగవంతం అవుతుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా వ్యవహరిస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

Chandra Babu: డీజీపీకి లేఖ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలి