అమరావతి రైతుల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వారికి వ్యతిరేకంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసింది జేఏసీ.. అయితే, పాదయాత్రపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.. పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామని ప్రకటించారు.. మా కడుపు కొడతామంటే ఊరుకోవాలా? అని ప్రశ్నించిన ఆయన.. పాదయాత్ర ఆపేయాలని అడుగుతాం.. ఆపకపోతే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 15న నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరుగుతోంది.. టీడీపీ పాదయాత్ర పేరుతో మా గుండెల పై కొడతామంటే ఎలా ఒప్పుకుంటాం? అని నిలదీశారు.. అచ్చెన్నాయుడుకు ఉత్తరాంధ్ర ఏం అన్యాయం చేసింది? అని మండిపడ్డ ఆయన.. అచ్చెన్నాయుడు అన్నం తింటుంటే విశాఖ రాజధానిగా ఒప్పుకోవాలన్నారు.
Read Also: Maoist Letter: ఏపీ మంత్రికి మరోసారి మావోయిస్టుల వార్నింగ్.. నాకు సంబంధం లేదు..!
అమరావతి రైతుల పేరిట సుమారు 11 వేల అభివృద్ధి చేసిన ఎకరాలు రైతుల చేతుల్లో ఉందన్నారు మంత్రి అప్పలరాజు.. చంద్రబాబు మనుషులు బాగుపడటానికే అమరావతి కుట్ర అని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు రోజుకో మాట చెబుతాడు అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ పెద్ద ఎత్తున విశాఖ గర్జనలో పాల్గొని విజయవంతం చేయాలని చేతులెత్తి అభ్యర్థించారు. ఇక, పవన్ కళ్యాణ్ అనంతపురం రాజధాని అన్నారు.. కర్నూలు వెళ్ళి మనసంతా కర్నూలే రాజధానిగా ఉండాలి అన్నారు.. విశాఖ వెళ్లి కూడా అదే మాట చెప్పారన్నారు. అమరావతిలో రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందన్నారు.. ఇప్పుడు ఏ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ కొత్త మాటలు చెబుతున్నారు?.. చంద్రబాబు తొత్తుగా వ్యవహరించటమే పవన్ కళ్యాణ్ పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.