Minister Roja Visited Krishnam Raju Family Members In Mogaltur: మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం మొగుల్తూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మంత్రి రోజా.. కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల్లో, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఘనత ఒక్క కృష్ణంరాజుకే దక్కుతుందని కొనియాడారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని, ఆయన మృతి కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణంరాజుకి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. భౌతికంగా కృష్ణంరాజు దూరమైనప్పటికీ.. ఆయన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ది ఎవ్వరూ మరువలేరన్నారు. సినిమాల్లో కృష్ణంరాజు రెబల్ స్టార్ అయితే.. రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని పేర్కొన్నారు. కృష్ణంరాజు ఆశయాలకు తగ్గట్టు ప్రభాస్ సినీ రంగంలో మరింత పేరు తెచ్చుకోవాలని మంత్రి రోజా కోరారు.
మంత్రి రోజాతో పాటు మరో మంత్రి చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి వేణు మాట్లాడుతూ.. సినీ రంగానికి కృష్ణంరాజు చేసిన సేవలకు గుర్తుగా మొగల్తూరు తీరప్రాంతంలో రెండు ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సినీ రంగం అభివృద్ధికి కృషి చేసిన వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తగిన గుర్తింపు ఇస్తారన్నారు. అనంతరం చీఫ్ విప్ ముదునూరి మాట్లాడుతూ.. మొగల్తూరులో పుట్టి సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రాణించడం ఈ ప్రాంతవాసుల అదృష్టమని తెలిపారు. కృష్ణంరాజు గుర్తుగా.. తీరప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తామని మాటిచ్చారు. కాగా.. ఈ సంస్మరణ సభకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీఎత్తున అభిమానులు పోటెత్తారు. 12 సంవత్సరాల తర్వాత ప్రభాస్ మొగల్తూరులో అడుగుపెట్టడంతో.. వేలాది సంఖ్యలో అతని ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో.. అక్కడి సందడి వాతావరణం నెలకొంది. విశేషం ఏమిటంటే.. అభిమానుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. టన్నుల కొద్దీ నాన్-వెజ్ వంటకాలు చేసి పెట్టారు.