Site icon NTV Telugu

Roja Selvamani: ఐ-టీడీపీ అంటే కొత్త నిర్వచనం చెప్పిన మంత్రి రోజా

Minister Roja

Minister Roja

Roja Selvamani:  తెలుగుదేశం పార్టీపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మరోసారి తనదైన శైలిలో ఫైరయ్యారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దుశ్శాసనుల పార్టీగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నేతలే అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతలు చేసే అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేత వేధింపుల వల్లే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లను వేధించిన వాళ్ళకే టీడీపీలో పదవులు ఇస్తున్నారని విమర్శించారు.

దివ్యవాణి చెప్పినట్టు మహిళలను వేధించినవాళ్ళకే టీడీపీలో పదవులు ఇస్తున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలోనే రిషితేశ్వరి లాంటి అమ్మాయిపై ఘోరం, వనజాక్షి లాంటి అధికారిని ఇసుకలో పడేసి కొట్టడం లాంటి ఘటనలు జరిగాయని.. ఇప్పుడు కూడా టీడీపీ నేతల వల్లే ఘోరాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రతిదానికి ట్వీట్స్ చేసే లోకేష్.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై ఎందుకు ట్వీట్ చేయలేదని నిలదీశారు. ఐ-టీడీపీ అంటే ఇడియట్స్ టీడీపీగా మారిందని మంత్రి రోజా చురకలు అంటించారు. టీడీపీ నేతలకు రాష్ట్రంలోని మహిళలంతా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Read Also: Child Marriages: బాల్య వివాహాలు ఆ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువట!

అటు మహిళలకు సాధికారత తెచ్చిన ప్రభుత్వం తమదేనని మంత్రి రోజా అన్నారు. మహిళల కోసం దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్, దిశా చట్టాన్ని కూడా తెచ్చారని గుర్తుచేశారు. కేంద్రంలో ఇంకా చట్టం అమలు కాకపోయినా ఆ స్ఫూర్తితో పనిచేస్తూ ఎక్కడా తప్పు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారని.. ఒకవేళ తప్పు జరిగినా 24 గంటల్లో నిందితుడిని పట్టుకుని చర్యలు తీసుకుంటున్నారని రోజా తెలిపారు.

Exit mobile version