NTV Telugu Site icon

Peddi Reddy: మేం చేసింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. ఫోన్ ట్రాకింగ్

Peddi Reddy

Peddi Reddy

ఏపీలో టీడీపీ నేత నారాయణ అరెస్ట్ అంశం మరో వివాదానికి దారి తీసింది. టెన్త్ ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసుల విచారణ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో నిందితులను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తాము అదుపులోకి తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించడంతో టీడీపీ తీవ్ర అభ్యంతరం చెప్తోంది. ఫోన్ ట్యాపింగ్ నేరమని.. ఈ విషయంలో సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు.

ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పలేదని.. ఫోన్లు ట్రాకింగ్ చేశారని చెప్పానని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఫోన్లు ట్యాపింగ్ చేయడమనేది క్రైం అనేది అందరికీ తెలుసన్నారు. పేపర్ లీకేజీ కేసులో దాదాపు 60 మందికి పైగా నిందితులను పట్టుకున్నారని.. ఈ క్రమంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారో ట్రాక్ చేశారని వివరణ ఇచ్చారు. ఆ విషయమే తాను చెప్పానన్నారు.

TDP: వైసీపీ నేతలకు దమ్ముంటే చంద్రబాబును అరెస్ట్ చేసి చూడాలి

టీడీపీ అధినేత చంద్రబాబు వయసుకు తగ్గట్లుగా ఆలోచనతో మాట్లాడటం లేదని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని.. మీటర్లు బిగిస్తే రైతుల గొంతులకు ఉరితాడు బిగించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. అయితే పారదర్శకత కోసమే వ్యవసాయ పంపు సెట్లకు ప్రభుత్వం మీటర్లు బిగిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ నెలాఖరులోగా రైతుల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసి అనుసంధానం చేస్తారన్నారు. వంద శాతం కరెంటు బిల్లుల మొత్తాన్ని రైతుల అకౌంట్‌లో ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొన్నారు. రైతులే నేరుగా డిస్కంలకు విద్యుత్ బిల్లులు కడతారన్నారు. మీటర్లు సక్సెస్ అయితే రైతులు తనకు ఓట్లేయరని చంద్రబాబు భావిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని.. చంద్రబాబు భాషను తాను మాట్లాడలేనన్నారు. చంద్రబాబు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. 14 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా పని చేసిన చంద్రబాబు ఎక్కడా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని పెద్దిరెడ్డి విమర్శించారు.