Site icon NTV Telugu

Minister Merugu Nagarjuna: కేసీఆర్, వైఎస్‌ జగన్ ధైర్యంగా రాజీనామా చేశారు.. టీడీపీకి ఆ దమ్ముందా..?

Merugu Nagarjuna

Merugu Nagarjuna

తెలంగాణ కోసం కేసీఆర్, వైసీపీ పార్టీ ఏర్పాటు కోసం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ధైర్యంగా రాజీనామాలు చేశారు.. టీడీపీకి దమ్ముంటే మీ వాళ్లంతా రాజీనామా చేయండి.. ఎన్నికలకు వెళ్దాం అంటూ సవాల్‌ విసిరారు మంత్రి మేరుగు నాగార్జున… అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ… రాజధానికి సంబంధించి నా నియోజకవర్గంలో టీడీపీ పాదయత్రలు చేస్తోంది.. ఆ పాదయాత్రలో రాజధాని ప్రాంత రైతులు, దళితులు ఎంత మంది ఉన్నారు? అని ప్రశ్నించారు. మీ ఉద్యమంలో ఉన్నవారంతా బయటి నుంచి వచ్చినవారే నన్న ఆయన.. నక్కా ఆనంద్ బాబు మీ స్థాయి ఏంటి? జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? అంటూ ఫైర్‌ అయ్యారు.. మా ముఖ్యమంత్రి పై టీడీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Minister Seediri Appalaraju: పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుంటాం.. మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా?

మీ ఉడత ఊపుళ్లకు చింతకాయలు కూడా రాలవు అంటూ టీడీపీ నేతలపై సెటైర్లు వేసిన మంత్రి నాగార్జున.. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు నా దగ్గర డబ్బులు లేకే భూములు కొనలేకపోయానని మీరే చెప్పారు..! అందుకే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్నాం అన్నారు.. వేమూరు నియోజకవర్గంలో మీ ఉద్యమంలో ఎంతమంది రాజధాని ప్రాంతం వారున్నారు? అని నిలదీశారు.. ఇక, మీ నాయకుడి ఆలోచన దళిత వ్యతిరేక ఆలోచన.. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు దగ్గర ఇంకా ఎందుకున్నారోనని బాధ కలుగుతుంది ! అని ఆవేదన వ్యక్తం చేశారు.. చంద్రబాబు దగ్గర మీరెందుకు ఇంకా చప్రాసీ ఉద్యోగం చేస్తున్నారో అర్ధం కావడం లేదని మండిపడ్డ ఆయన.. నిజంగా దళితుల్లో పుట్టిన వారెవరూ చంద్రబాబు దగ్గర ఉండరన్నారు.

చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులను వాడుకుని వంచించిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఘాటుగా స్పందించారు నాగార్జున… రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి మోసం చేశారని విమర్శించారు.. ఏమీ లేని చోట చెట్లు, పుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడతారా? అని నిలదీసిన ఆయన.. చంద్రబాబు మోసాలను ఎండగట్టడానికి అంబేద్కర్ పాదాల సాక్షిగా ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్‌ విసిరారు.. ఇక, మంత్రి ఆర్కే రోజాకు దళితులంటే అమితమైన గౌరవం.. గతంలో ఆమె మాట్లాడిన మాటలను వక్రీకరించి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి మేరుగు నాగార్జున.

Exit mobile version