Site icon NTV Telugu

Dharmana Prasad Rao: రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన.. వారించిన సీఎం జగన్

Dharmana Prasad Rao

Dharmana Prasad Rao

Dharmana Prasad Rao: ఏపీలో వికేంద్రీకరణ అంశంపై రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను అధికార పార్టీ నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై అధికార పార్టీలో కీలక సంకేతాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ సాధన ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. విశాఖ రాజధాని ఉద్యమం చురుగ్గా, చైతన్యవంతంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకుంటానని ఆయన వివరించారు. ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కన్నా మంత్రి పదవి గొప్పది కాదని ధర్మాన అభిప్రాయపడ్డారు. దీంతో తన రాజీనామాను అనుమతించాలని కోరారు.

అయితే రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీఎం జగన్ వారించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయమని ధర్మానకు సీఎం జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ పంచుతూ, వికేంద్రీకరణ చేపడదామని, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ విధానమని జగన్ తెలియజేశారు. మూడు ప్రాంతాలకు సమన్యాయమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అటు ఇప్పటికే విశాఖ రాజధాని కోసం విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధర్మాన కూడా రాజీనామా చేస్తానని చెప్పడంతో మున్ముందు ఇంకా ఎంతమంది ఉత్తరాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధపడతారో వేచి చూడాల్సిందే.

Read Also: Ambedkar Konaseema: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఐడీ కార్డు ఉంటేనే అనుమతి

మరోవైపు ఇటీవల మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఆక్రమించిన భూములను పేదలకు పంచాలని పవన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై శుక్రవారం సీఎం జగన్‌కు మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరణ ఇచ్చారు. భూ ఆక్రమణలకు సంబంధించి సిట్ నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించారు. భూ ఆక్రమణలకు సంబంధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సీఎం జగన్‌కు తెలిపారు.

Exit mobile version