ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల విషయంపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు.. ఇలా దుమ్మెత్తిపోసుకుంటున్నారు.. తాజాగా, రాష్ట్రంలో అర్థిక ఇబ్బందులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. అసలు, టీడీపీ చేసిన తప్పులు, అప్పుల వల్లే నేటికీ ఆంధ్రప్రదేశ్‌కు తిప్పలు అని పేర్కొన్నారు.. యనమలది కునుకు పాటా?’ఉనికి పాట్లా? అంటూ మాజీ ఆర్థికశాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిపై సెటైర్లు వేసిన ఆయన.. అప్పులపై మీ అంచనాలు తలకిందులైనా మీ అసత్య ప్రచారం ఆపరా ? అంటూ మండిపడ్డారు. ఎఫ్ఆర్బీఎం, కేంద్రం, కాగ్ లను మించి.. ఆర్ధిక వ్యవస్థకు సంబంధం లేని వాళ్లే టీడీపీ ఆస్థాన ఆర్థిక నిపుణులా..? అంటూ ఎద్దేవా చేశారు.
ఇక, 2021 -22 కాలంలో 15వ ఆర్ధిక సంఘం ద్రవ్యలోటు పరిమితిని 4.5 శాతం విధిస్తే, కోవిడ్ విధి వైపరీత్యంలోనూ వైసీపీ ప్రభుత్వం కేవలం 2.1 శాతం మాత్రమే అప్పు చేసిందని పేర్కొన్నారు మంత్రి బుగ్గన.. మరోవైపు, మొత్తం రూ. 1,85,000 కోట్లు డీబీటీల ద్వారా పంపిణీ చేస్తున్నాం.. మా ప్రభుత్వమున్నంత వరకూ రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు ఏ ఇబ్బంది లేదు.. రాదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు, ఆర్థిక నిర్వహణపై ప్రతిపక్షాలది పూటకో మాట అంటూ మండిపడ్డారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. కాగా, టీడీపీ హయాంలోనే అప్పులు ఎక్కువ చేశారని వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది.. వారు పెట్టిన బకాయీలను కూడా తమ ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చిందని పలు సందర్భాల్లో అధికార వైసీపీకి చెందిన మంత్రులు, నేతలు చెబుతూ వస్తున్న మాట విదితమే.
