NTV Telugu Site icon

Botsa Satyanarayana: వాళ్లు విలీన మండలాలు అడిగితే.. రెండు రాష్ట్రాలను మళ్లీ కలపాలని మేం డిమాండ్ చేస్తాం

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana comments on polavaram project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారని పువ్వాడ అజయ్‌ను ప్రశ్నించారు. డిజైన్ల ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని.. దాన్ని ఎవరూ మార్చలేదన్నారు. భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తావించారని గుర్తుచేశారు. విభజన చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని బొత్స వ్యాఖ్యానించారు. వందేళ్ల తర్వాత మొదటిసారి ఈ నెలలో గోదావరికి ఇంత పెద్దఎత్తున వరద వచ్చిందని.. పోలవరం వల్ల కాదని స్పష్టం చేశారు.

Read Also: Puvvada Ajay: పోలవరం ఎత్తు తగ్గించి.. ఆ మండలాలు మళ్ళీ కలపాలి

రాష్ట్రవిభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని.. అలాగని హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని అడగగలమా అని బొత్స సూటి ప్రశ్న వేశారు. వాళ్లు విలీన మండలాలు కలపాలని డిమాండ్ చేస్తే.. రెండు రాష్ట్రాలను మళ్లీ కలపాలని తాము డిమాండ్ చేస్తామన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు కదా అని బొత్స అభిప్రాయపడ్డారు. విలీన మండలాలు కలిపేయాలని మాట్లాడటం సరికాదన్నారు. సమస్యల పరిష్కారమే ఇప్పుడు ముఖ్యమన్నారు. కొందరు వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాల్సి ఉందన్నారు. సీఎం అయినా, మంత్రులైనా బాధ్యతగానే మాట్లాడాలని హితవు పలికారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదని బొత్స అన్నారు. పువ్వాడ అజయ్ ఆయన సంగతి ఆయన చూసుకోవాలని సూచించారు. ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల సంగతి ఆయన చూసుకుంటే సరిపోతుందన్నారు. ముంపు మండలాల ప్రజలు ఏపీ రాష్ట్ర కుటుంబ సభ్యులు అని.. వారి సంగతి మేం చూసుకుంటామని బొత్స అన్నారు.