NTV Telugu Site icon

Botsa Satyanarayana: సీపీఎస్ రద్దు సాధ్యం కాదు.. ఓపీఎస్ అమలు కుదరదు..!!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని ఏపీలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అధికారంలోకి వచ్చాక పూర్వపరాలు చర్చిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారని.. సీపీఎస్ రద్దు చేసేందుకు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. సీపీఎస్ కంటే మెరుగైన విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చిందని బొత్స పేర్కొన్నారు.

కాగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉద్యోగ సంఘాలతో జరిగే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జీపీఎస్ అమలుపై మరిన్ని అంశాలు చర్చిస్తామని బొత్స తెలిపారు. ఇప్పటివరకు తనతో తన ఇంట్లో జరిగిన సమావేశాలు అనధికారికమేనని.. ఈరోజు ఉద్యోగ సంఘాలతో జరిపే సమావేశమే అధికారికమైందని బొత్స అన్నారు. ఇవాళ్టి సమావేశానికి రావాలని అన్ని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించిందని.. సమావేశానికి అన్ని ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని ఆశిస్తున్నామన్నారు. వారు రాకపోతే సీపీఎస్ బాగుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నట్లు భావిస్తామన్నారు.

Read Also: CM Jagan: మంత్రులకు సీఎం జగన్ హెచ్చరిక.. తీరు మార్చుకోకపోతే కేబినెట్‌లో మార్పులు తప్పవు

ఈరోజు జరిగే సమావేశాన్ని ఉద్యోగ సంఘాలు బాయ్ కాట్ చేస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని బొత్స చెప్పారు. ఉద్యోగ సంఘాల డిమాండ్‌ల గురించి ఊహాజనితంగా మాట్లాడవద్దని బొత్స కోరారు. ఉద్యోగులకు సీపీఎస్ కంటే మంచి స్కీం ఇస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ వల్ల ఉద్యోగస్తులకు ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమేనన్నారు. తాము 95 శాతం మానిఫెస్టోలో అంశాలు నెరవేర్చామని.. మిగిలి పోయిన 5 శాతం అంశాల్లో సీపీఎస్ రద్దు కూడా ఒకటి అని పేర్కొన్నారు. ఓపీఎస్ అమలు కుదరదని అనేకసార్లు చెప్పేశామన్నారు. ఓపీఎస్‌తో ఎన్నో ఆర్ధిక అంశాలు ముడిపడి ఉన్నాయని.. దానికన్నా మంచి స్కీం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని బొత్స అన్నారు.