Site icon NTV Telugu

Balineni Srinivas Reddy: విద్యుత్ కోతలను ప్రతిపక్షాలు భూతద్దంలో చూపిస్తున్నాయి

ఏపీలో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు నెలకొన్నాయి. ఎక్కువగా గ్రామాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ రెండు గంటల నుంచి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీలో చిన్న చిన్న విద్యుత్ కోతలు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ వాటిని ప్రతిపక్షాలు భూతద్దంలో చూపుతున్నాయని ఆయన ఆరోపించారు.

గత ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేసి వెళ్లడంతోనే విద్యుత్ కోతలకు కారణమని మంత్రి బాలినేని వివరణ ఇచ్చారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఏపీని విభజించారని.. కాబట్టి విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఉందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. డీజీపీగా గౌతమ్ సవాంగ్ రెండున్నరేళ్లు పనిచేశారని.. ఆయనకు ఇప్పుడు కూడా ప్రభుత్వం మంచి పోస్టింగ్ ఇచ్చిందని బాలినేని అభిప్రాయపడ్డారు.

Exit mobile version