జనసేన ఆవిర్భావ సభలో తనపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనే హీరో.. పొలిటికల్‌గా తాను హీరోనని మంత్రి అవంతి అన్నారు. పవన్‌కు అహంభావం ఎక్కువ అని.. అతడి సినిమాల్లో విజయాల కంటే ఎక్కువ పరాజయాలే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప పవన్ వాస్తవాలు తెలుసుకోరా అంటూ ప్రశ్నించారు.
మరోవైపు తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా గత మూడేళ్ల కాలంలో జనసేన కార్యకర్తలపై గూండాగిరి చేశానని పవన్ నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ నిరూపించకుంటే పవన్ రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. పవన్ టీడీపీతో పొత్తు నుంచి ఎందుకు బయటకు వచ్చారని.. మళ్లీ ఇప్పుడు ఎందుకు కలుస్తానంటున్నారని ఆయన నిలదీశారు. బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రానికి ఏం సాధించగలిగారో ప్రజలకు పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి టూరిస్టుగా వచ్చే పవన్‌కు అభివృద్ధి గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు.
