Site icon NTV Telugu

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచుతాం

Polavaram1

Polavaram1

పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతికి సంబంధించి ప్రమాదకర పరిస్థితులను శుక్రవారం మధ్యాహ్నం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రస్తుతం పోలవరం వద్ద ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే కాఫర్ డ్యామ్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని తెలిపారు. అందుకే పటిష్ట చర్యలు చేపట్టామని వివరించారు. ఇప్పటికే లోయర్ కాఫర్ డ్యాం మునిగిపోవడంతో డయాఫ్రం వాల్‌పై వాటర్ ప్రవేశించడంతో పనులు నిలిచిపోయాయని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read Also: Movie Theaters :400 థియేటర్ల మూత… థియేటర్లకు దిక్కెవరు?

ఎగువ నుండి భారీ స్థాయిలో గోదావరికి వరద నీటి ప్రవాహం వస్తోందని.. పోలవరం వద్ద 28 లక్షల క్యూసెక్కులు వస్తేనే ఎగువ కాఫర్ డ్యాం తట్టుకోగలదని మంత్రి అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. అంతకంటే ఎక్కువైతే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచే ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. కాగా ఎగువ కాఫర్ డ్యాం వద్ద ప్రస్తుతం 36 మీటర్ల ఎత్తున నీటి నిల్వ ఉంది. ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 43 మీటర్లు. ప్రస్తుతం నీటిమట్టానికి, కాఫర్ డ్యాం ఎత్తుకు మధ్య వ్యత్యాసం ఉన్నా.. పైన రెండు మీటర్లు పూర్తి కోర్‌తో నిర్మించలేదు. దాంతో 41 మీటర్ల వరకే పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం గోదావరికి ఎగువ నుంచి భారీగా వరద తరలివస్తోంది. అందుకే ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును ఇసుక బస్తాలు, రాళ్లు పేర్చి కొంత ఎత్తు పెంచాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Exit mobile version