ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ తరహాలో ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తారని అందరూ భావించారు. కానీ ఈ వార్తలపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. మంత్రి సురేష్ ప్రకటన నేపథ్యంలో సోమవారం నుంచి యథావిధిగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.
Read Also: ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు..?
అయితే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 30 వరకు సెలవులు పొడిగిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు భావించారు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో రోజుకు 4వేలకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 13.87 శాతానికి చేరిన నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో స్కూళ్లు తెరిస్తే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సోమవారం నాడు కరోనా పరిస్థితిపై ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరపనుంది. ఈ సమావేశం అనంతరం సెలవులపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
