YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గత కొద్ది రోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్న సీఎం జగన్ సోమవారం విజయవాడలో ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్‌లో వైద్య పరీక్షలను చేయించుకున్నారు. విజయవాడ మొగల్రాజపురం లోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ కు మధ్యాహ్నం వైయస్ జగన్ వచ్చారు. డయాగ్నస్టిక్ సెంటర్‌లో ముఖ్యమంత్రికి ఎంఆర్ఐ స్కాన్ తో పాటు వివిధ రకాల రక్త పరీక్షలు చేసినట్లు సమాచారం. పరీక్షల కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు డయాగ్నోస్టిక్ సెంటర్‌లోనే ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు డయాగ్నస్టిక్‌కు చేరుకున్న సీఎం తిరిగి మూడు గంటల సమయంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. వైఎస్ జగన్ వెంట ఆయన సతీమణి భారతీ రెడ్డి కూడా ఉన్నారు.
Read also: Mahesh Babu: మహేశ్ బాబు – సౌందర్య కాంబినేషన్లో మిస్ అయినా సినిమా ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ రాష్ట్ర స్థాయి 21వ మహాసభలు సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 30వేల మందికి పైగా ఉద్యోగులు, ఏపీఎన్జీవో సభ్యులు మహాసభలకు హాజరయ్యారు. మహాసభల మొదటి రోజు సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగులందరికీ అనుకూలంగా ఉండేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చామని, జీపీఎస్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయడానికి ఉద్దేశించిన ఆర్డినెన్స్ ఒకట్రెండు రోజుల్లో విడుదల చేస్తామని వైఎస్ జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ పెన్షన్ స్కీమ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. తన ప్రసంగం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నుంచి నేరుగా మొగల్రాజుపురంలోని డయాగ్నస్టిక్ సెంటర్‌కు చేరుకుని వైద్య పరీక్షలను చేయించుకున్నారు. కాలి మడమకు స్కానింగ్ తీయించుకున్న తరువాత పరీక్షలు పూర్తికాగానే తిరిగి తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.