ఆన్‌లైన్ పుణ్యమా అని.. ఎవరు అసలు.. ఎవరు నకిలీ అనే గుర్తించడమే కష్టంగా మారిపోయింది… ఆశ చూపుతూ అన్నీ దోచేస్తున్నారు.. అసలు విషయం తెలిసేలోపు.. అందినకాడికి దోచేస్తున్నారు.. తాజాగా, విశాఖ, మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టిన ఘటన వెలుగుచూసింది.. రెండో వివాహం కోసం ప్రొఫైల్ పెట్టిన మహిళలే టార్గెట్‌గా.. వెబ్ సైట్‌లో పెట్టిన వివరాల ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు నైజిరియన్లు.. విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్టు చెబుతూ పరిచయం చేసుకుంటున్న కేటుగాళ్లు.. విలువైన బహుమతులు పంపుతున్నామంటూ వల విసురుతున్నారు.. వారిని నమ్మినవారికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారులు అంటూ ఇంకొకరితో ఫోన్ చేయించడం.. టాక్స్ కడితే విడిచి పెట్టేస్తానంటూ లక్షలు గుంజేస్తున్న వైనం బయటపడింది.. ఇటీవల కాలంలో పెరుగుతున్న ఈ తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
Read Also: Indias National Cinema Day: మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.75కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే ఛాన్స్
విశాఖలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధురవాడకు చెందిన ఒక ముస్లిం యువతికి కొన్నాళ్ల కిందట వివాహమైంది. రెండేళ్ల పాప ఉంది. భర్తతో విభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకుంది. రెండో పెళ్లి కోసం తన ప్రొఫైల్‌ను ఒక మ్యాట్రిమోనీ డాట్‌కామ్‌లో అప్‌లోడ్ చేశారు.. సంబంధిత వెబ్‌సైట్‌లో ఆమె వివరాలను చూసిన కేటుగాళ్లు.. నెలరోజుల కిందట ఆమెకు ఫోన్ చేశారు.. తాను దుబాయ్‌లో ఉంటానని, తనకు మొదటి భార్యతో విడాకులయ్యాయని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. మీ ప్రొఫైల్ చూశాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ నమ్మబలికాడు.. ఇక, తర్వాత తన ప్లాన్‌లో భాగంగా.. చాటింగ్‌తో ఆమెకు దగ్గరయ్యాడు.. వారం రోజుల తర్వాత తాను త్వరలోనే భారత్‌కు వచ్చేస్తున్నానని.. టిక్కెట్లు కూడా బుక్ చేసుకుంటానని చెప్పాడు. అంతకుముందే కొన్ని బహుమతులు పంపిస్తున్నానంటూ ప్యాక్ చేసి వున్న బాక్స్‌ల ఫొటోలు ఆమెకు వాట్సాప్ ద్వారా పంపించాడు కేటుగాడు..
అక్కడే అసలు కథ మొదలైంది.. మూడు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి అంటూ మరో ఫోన్ వచ్చింది.. మీ పేరుతో విదేశాల నుంచి కొన్ని బహుమతులు వచ్చాయని, వాటికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని ఫోన్‌లో తెలిపారు.. ఇది నిజమేనని భావించిన బాధితురాలు.. వారు చెప్పిన అకౌంట్‌కు డబ్బులు పంపింది. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు.. మీకు వచ్చిన ప్యాక్‌లను స్కానింగ్ చేయగా లోపల అత్యంత ఖరీదైన బంగారం, డైమండ్స్ ఉన్నాయని.. వాటిని అనుమతించాలంటే వాటి విలువలో కొంత పర్సంటేజీ కస్టమ్స్ డ్యూటీగా చెల్లించాలని నమ్మబలికారు.. దీంతో, మరికొంత మొత్తాన్ని డిపాజిట్ చేసింది బాధితురాలు. అయితే, గిఫ్ట్‌లు ఏమీ రాకపోవడంతో.. ఇక అసలైన వ్యక్తికి ఫోన్ చేశారు.. తానే ఇండియాకు వస్తున్నాను.. మరికొన్ని విలువైన బహుమతులు తెస్తున్నానని.. ఇక ఎవరు ఫోన్ చేసినా డబ్బులు పంపొద్దని చెప్పిన కేటుగాడు.. మరుసటిరోజు మళ్లీ ఫోన్ చేసి.. తాను ఇండియన్ కరెన్సీ లేకుండా వచ్చా.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్నాను.. తనకు కొంత డబ్బులు పంపించాలని కోరాడు.. ఇలా విడతల వారీగా రూ.18 లక్షలు లాగేశాడు.. ఆ తర్వాత గానీ బాధితురాలికి అసలు విషయం అర్థం కాలేదు.. ఎందకంటే.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్.. మెసేజ్ పెట్టినా నో రిప్లై.. దీంతో, మోసపోయానని గుర్తించిన బాధితురాలు.. సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.