Site icon NTV Telugu

Mallikarjun Kharge: దేశం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేశాయి? బలిదానాలు చేశాయా?

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే విజయవాడలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసే అరుదైన అవకాశం తనకు వచ్చిందన్నారు. తాను ఇప్పటికే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నానని.. సుదీర్ఘ కాలం పాటు కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం చేశానని తెలిపారు. 2009లో సోనియా గాంధీ సూచనల మేరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశానని.. కేంద్ర కార్మిక శాఖ, సోషల్ జస్టిస్ మంత్రిగా సేవలు అందించినట్లు వివరించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఏఐసీసీ అధ్యక్షులుగా ఉండడానికి నిరాకరించడంతో ఎన్నిక అనివార్యమైందన్నారు. అధ్యక్ష స్థానంలో గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు లేకపోవడం బాధాకరమన్నారు.

Read Also: Washington : అక్కడ తినడమే అతను చేసిన నేరం.. అందుకే ఫైరింగ్

అందరి సూచనల మేరకు అధ్యక్ష స్థానానికి తాను అభ్యర్థిగా నిలిచినట్లు మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. ఏపీ నుంచి వచ్చిన వాళ్లు దేశాన్ని నిర్దేశనం చేశారని గుర్తుచేసుకున్నారు. బీజేపీ, ఆరెస్సెస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే బలం తనకు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లను 50 ఏళ్ల వయసులోపు వారికే ఇస్తామని తెలిపారు. దేశంలో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందన్నారు. తన తల్లి, సోదరుడు, సోదరిలను రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో కొల్పోయానని మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. రాహుల్ చేసేది భారత్ జోడో యాత్రే అని.. ఆయనది భారత్ తోడో యాత్ర అని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. కుల, మతాల వారీగా బీజేపీ దేశాన్ని విభజిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఏమైనా బలిదానాలు చేశారా అని మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. ఇందిరా, రాజీవ్ వంటి వారు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని ప్రశంసించారు.

Exit mobile version