టెక్నాలజీ ఎంతగా పెరిగినా ఇంకా మూఢనమ్మకాల ఛట్రంనుంచి జనం బయటపడలేకపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని అందరికీ తెలుసు… అలాగే చనిపోయిన మనిషి మంత్రాలకు లేచొస్తాడా?.ఈ తరహా ఘరానా మోసం ఎన్టీఆర్ జిల్లా తోటచర్ల లో చోటు చేసుకుంది….చనిపోయిన భర్త లేచి వస్తాడు అనటంతో ఓ మంత్రాల మోసగాడికి 50 వేలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుందో మహిళ. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలు మండలం తోటచర్ల గ్రామానికి చెందిన వెంకట్రావమ్మ భర్త సుధాకర్ నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.
Minister Roja : ఆ మంత్రికి కారు ఎక్కడినుంచి వచ్చింది.? అందుకే సైలెంట్ అయ్యారా.?
కటిక పేదరికంలో ఉన్న ఆమె, భర్త లేకున్నా చిన్నా చితక పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది…ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా పెద్దకూరపాడుకు చెందిన గోపి అనే మంత్రగాడు ఆమెకు మాయమాటలతో చనిపోయిన ఆమె భర్తను బ్రతికిస్తాను అని నమ్మబలికాడు. మంత్ర తంత్రాలతో చేసే ప్రత్యేక పూజతో చనిపోయిన సుధాకర్ లేచొస్తాడని…. గతంలో ఇలా ఎంతో మందిని బ్రతికించానని సుధాకర్ ను కూడా మళ్లీ బ్రతికించగలనని ఆమెను మెల్లగా ఉచ్చులోకి లాగాడు….శ్రావణ మాసం వచ్చేలోపు నుదుట బొట్టు పెట్టుకోవచ్చని,మళ్ళీ భర్తతో సంతోషమైన జీవితం గడపొచ్చని ఆమెకు ఆశలు పుట్టించాడు…ఆమెను ఎలాగైనా ఒప్పించి చనిపోయిన సుధాకర్ నాలుగు రోజుల్లో ఇంటికి వస్తాడని ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడా మాయగాడు.
మంత్రగాడు చెప్పిన మాయమాటలు నమ్మిన ఆమె భర్త తిరిగొస్తాడనే ఆశతో అతనితో బేరం కుదుర్చుకుంది..మంత్రాలు ,పూజలు చెయ్యటానికి మొత్తం 70 వేల రూపాయలు ఖర్చవుతుందన్నాడు. అంత మొత్తం చెల్లించలేనని….తన భర్తను ఎలాగైనా బ్రతికించి తీసుకుని రావాలని 50 వేల రూపాయలు ఇవ్వగలనని ఒప్పందం కుదుర్చుకుంది…దాంతో సరే అన్న మంత్రగాడు గోపి ఆమె ఇంట్లో తాంత్రిక పూజలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి మంత్రాలు చదువుతూ.. ఏవేవో కట్టి 20 వేలు తీసుకుని నాలుగు రోజుల్లో నీ భర్త తిరిగి వస్తాడని వెళ్ళిపోయాడు….అలా వెళ్లిన అతను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మిగిన బ్యాలెన్స్ డబ్బుల 30వేల కోసం ఎలాగైనా వసూలు చేసుకుని రమ్మని రెడ్డయ్య అనే మరో మంత్రికుడిని పంపాడు….డబ్బులు వసూలు చెయ్యటానికి తోటచర్ల వచ్చిన ఆ మోసగాడు అడ్రస్ తెలియక అడ్డంగా బుక్ అయిపోయాడు.
ఆమె ఇంటి కోసం ఆ చుట్టుపక్కల పదే పదే తిరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు అతన్ని పట్టుకుని గట్టిగా నిలదీశారు. దీంతో అసలు వ్యవహారం చెప్పేసాడు. దాంతో కంగుతిన్న గ్రామస్థులు అతన్ని పట్టుకుని నాలుగు తన్ని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారం అంతా తెలుసుకున్న అసలు మాయగాడు తీసుకున్న 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా వెనక్కి వేసి మాయమైపోయాడు. భర్త వెనక్కి రాకపోవటంతో మోసపోయానని అర్ధం చేసుకున్న భార్య లబోదిబోమంటోంది. ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చచ్చిన వ్యక్తి తిరిగి వస్తాడని నమ్మడం తెలివితక్కువ తనమే. ఇలాంటివి నమ్మకండి.. మీ విలువైన డబ్బులు వృధా చేసుకోవద్దు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.
