NTV Telugu Site icon

తెలుగు గుండెల్లో చెరగని ముద్ర.. సిరివెన్నెల

సిరివెన్నెల సీతారామ శాస్త్రి దాదాపు 3000 పాటలకు రాశారు. ఇక ప్రత్యేకంగా పొందుపరిచిన ఆయన పాటలు, రూపకాలు, ఛందస్సు, కవిత్వం, ప్రాసలకు ప్రసిద్ధి చెందాయి. తెలుగు సాహిత్యంలో నేటి తరానికి అర్థమయ్యేలా పాటలు రచించడంలో ఆయన స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు వరుసకు అల్లుడు అవుతారని అందరికి తెలిసిన విషయమే. త్రివిక్రమ్ టాలెంట్ ను రచయితగా ఉన్నప్పుడే గుర్తించిన సీతారామశాస్త్రి ఆయన సోదరుడు కూతురిని ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారి బంధం మరింత దగ్గరయ్యింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పటికి కూడా సీతారామశాస్త్రిని ఒక గాడ్ ఫాదర్ తరహాలో గౌరవిస్తూ ఉంటారు. తెలుగు పాటకు వెలుగులద్దిన గీతరచయిత. కఠినమైన సమాసాలను కమనీయంగా కూర్చి, గమ్మత్తైన మాటలకు అర్థాల సొగసు అద్దారు. ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఆ పాటలకు అనేక సార్లు నంది బహుమతులు వచ్చాయి. అవార్డులకే వన్నె తెచ్చిన అరుదైన రచయిత సిరివెన్నెల. ఆయన రాసిన ప్రతిపాట ఆణిముత్యం. ఇప్పటికీ సామాన్యుల ఇళ్ళల్లో, సెల్ ఫోన్లలో ఆయన పాటలు మారుమోగుతుంటాయి. తెలుగు పాటల పూదోటలో ఆయన మకుటం లేని మహారాజు. సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు విశ్వనాథ్. నమ్మకాన్ని వమ్ముచేయకుండా అద్భుతమైన రచనలను అందించారు సీతారామశాస్త్రి. తెలుగు గుండెల్లో ఆయన రాసిన పాటలెన్నో చెరగని ముద్ర వేశాయి.

ఉర్రూతలూగించిన పాట నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం మారదు కాలం

దేవుడు దిగి రాని యెవ్వరు ఎమై పోని

మారదు లోకం మారదు కాలం

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి

గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి

ఎ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం

యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం

రామబాణమార్పిందా రావణ కాష్ఠం

కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం మారదు కాలం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా

అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా

వేట అదే వేటు అదే నాటి కధే అంతా

నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా

బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా

శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం మారదు కాలం

దేవుడు దిగి రాని యెవ్వరు ఎమై పోని

మారదు లోకం మారదు కాలం

ఆదిభిక్షువు వాడినేది కోరేది
సీతారామశాస్త్రి గారి తొలి సినిమా ఇది. ఇదే చివరకు ఆయన ఇంటిపేరుగా మారింది. ఇందులో ఆయన రాసిన పాటలన్నీ చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ పాట ప్రత్యేకంగా నిలిచింది. శివుడిని నిందాస్తుతితో కీర్తించే పాట ఆయనకు నంది అవార్డ్‌ను తెచ్చిపెట్టింది.

తెలవారదేమో స్వామి
‘శ్రుతిలయలు’ సినిమాలోని ఈ పాట అద్భుతంగా ఉంటుంది. జేసుదాస్ పాడిన తెలుగు పాటల్లో ఒక ఆణిముత్యంగా నిలిచింది. ఈ పాట నంది అవార్డుల జ్యూరీ ముందుకు వెళ్లినప్పుడు, దీన్ని అన్నమాచార్య కీర్తన అని పక్కన పెట్టారట. ఆ తర్వాత నిజం తెలిసి, నందిని ఆయనకు అందించారు.

అందెల రవమిది
స్వర్ణకమలం సినిమాలో పాటలన్నీ నేటికీ నిత్యనూతనంగా ఉంటాయి. అందులో క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాట కళ గొప్పతనాన్ని, కళాకారుల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ పాటకూ ఆయన నందిని కైవసం చేసుకున్నారు.

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని
తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయే పాట ఇది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సిందూరం’ సినిమాలో టైటిల్ సాంగ్ అయిన ఈ పాట దేశంలోని అన్యాయాల్ని, దురాగతాల్ని ప్రశ్నిస్తుంది. ఈ పాటకూ ఆయన నందిని పొందారు.

జగమంత కుటుంబం నాది
ఇది ఈ సినిమా కోసం రాసింది కాదు. సిరివెన్నెల ఏనాడో రాసిన పాటను ఈ చిత్రానికి వాడుకున్నారు దర్శకుడు కృష్ణవంశీ. జీవిత తత్వాన్ని అద్భుతమైన మాటలతో మనముందు ఉంచారు సిరివెన్నెల. ఆయన ఖాతాలో మరో నంది వచ్చి చేర్చింది.

‘జామురాతిరి… జాబిలమ్మా…’ అంటూ జోల పాడి అందరినీ హాయిగా నిద్రపుచ్చగలరు సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినది’ అనే పాట ఇప్పటికీ లక్షల మంది తెలుగు వాళ్ల ఫేవరెట్ పాట. ఆ పాట రాయడానికి వారం రోజుల టైం పట్టిందంటారు సిరివెన్నెల. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదినంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించారాయన. ఆయన రాసిన పాటల్లో వందల పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయన లేరన్న వార్త విని పాట మూగబోతోంది.