ఏపీలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌వాడీ కార్మికులు నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సోమవారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎల్‌పీవో, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు సెలవు మంజూరు చేయవద్దని కలెక్టర్లు ఆయా శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి స్కానింగ్ ప్రతులను ఉ.10:45 గంటల్లోగా ఉన్నతాధికారులకు పంపించాలని, హెడ్‌క్వార్టర్లు విడిచిపెట్టి వెళ్లరాదని ఆదేశించారు.
మరోవైపు ప్రతి సోమవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గ్రీవెన్స్ నిర్వహిస్తారు. బాధితులు తమ తమ సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి సోమవారం సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో ఇకపై ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయకూడదని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటించాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఈ ఆదేశాలపై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
