Lakshmi Parvathi: చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ నేత లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ తగిలింది. ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరు అంటూ సుప్రీంకోర్టు ఆమెను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. తన కేసులో ఒకరి ఆస్తుల గురించి ప్రశ్నించడానికి తానెవరు అని అత్యున్నత నాయస్థానం ప్రశ్నించిందని.. అయితే జగన్ ఆస్తుల కేసులో శంకర్‌రావు ఎవరు అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఎవరు అని నిలదీశారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో సుబ్రహ్మణ్యం ఎవరు అని అడిగారు. న్యాయస్థానం ఈ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని విచారిస్తే బాగుండేదని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు.
Read Also: Cheating Case: టీడీపీ అధికార ప్రతినిధిపై హైదరాబాద్‌లో కేసు.. రూ.20 వేలు తీసుకొని ఇలా..!
కోర్టు కోర్టు కో తీర్పు.. మనిషి మనిషికో న్యాయం అన్నట్లుగా ఉందని లక్ష్మీపార్వతి అసహనం వ్యక్తం చేశారు. ఏమైనా తాను చివరి వరకు పోరాడానని.. కాలమే అవినీతిపరుడు అయిన చంద్రబాబును శిక్షించాలని కోరుకుంటున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. అంతకంటే నిస్సహాయులకు దిక్కు ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని చెప్పడానికి ఆధారాలు లేవని గతంలో ట్రయల్ కోర్టు, హైకోర్టులు తీర్పును వెలువరించినా లక్ష్మీపార్వతి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. చంద్రబాబు, ఆమెకు మధ్య రాజకీయ వైరం ఉందన్న విషయాన్ని గతంలో హైకోర్టు పరిగణనలోకి తీసుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
