Tragedy in Kurnool: కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. నీటికుంటలో పడి ఆరుగురు స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగిలిలో ఈ ఘటన విషాదాన్ని నింపింది.. స్కూల్ కి వెళ్లిన విద్యార్థులు స్కూల్ వదిలిన తరువాత సమీపంలో నీటి కుంటకు ఆడుకునేందుకు వెళ్లారు.. నీటికుంటలో ఆడుకుంటూ జారిపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు. మృతులు శశికుమార్, కిన్నెరసాయి, సాయి కిరణ్, భీమ, వీరేంద్ర, మహబూబ్ గా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి గ్రామానికి తరలించారు. ఒకేసారి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: Tummala Nageswara Rao : కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్
అయితే, నీటికుంటలో పడి ఆరుగురు చిన్నారుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. కర్నూలు జిల్లా, ఆస్పరి మండలం, చిగిలిలో ఆరుగురు చిన్నారుల మృతి చెందడంపై స్పందించిన సీఎం.. ఐదవ తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే ఆరుగురు విద్యార్థులు ఆడుకుంటూ నీటికుంటలో పడి మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చిందన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
