Prakash Jain resigned from BJP: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. అయితే, తనకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టం అంటున్నారు ప్రకాష్ జైన్.. కానీ, ఎమ్మెల్యే పార్థసారథి విధానాలు నచ్చకే బీజేపీకి రాజీనామా చేశానని వెల్లడించారు.. మరోవైపు.. బీజేపీ నాయకులు చేసిన అవినీతిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాష్ జైన్..
Read Also: IRE vs RSA: క్రికెట్‌లో మరో సంచలనం.. దక్షిణాఫ్రికాను ఓడించిన ఐర్లాండ్!
ఆదోని నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు నచ్చకే బీజేపీకి రాజీనామా చేస్తున్నాను అన్నారు ప్రకాష్ జైన్… ఆదోని నియోజకవర్గంలో బీజేపీలో కొందరు నాయకులు స్వలాభం కోసం పార్టీ ఎదుగుదలను తొక్కి పెడుతున్నారని వాపోయారు. ఈ తతంగమంతా బీజేపీ రాష్ట్ర కమిటీకి విన్నవించిన స్పందన లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్. కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా సిట్టింగ్ ఎంపీలు సహా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. నేతలు.. ప్రజాప్రతినిధులు ఇలా చాలా మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. ఎక్కువ మంది టీడీపీ గూటికి చేరితే.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీలో చేరారు.. కానీ, ఇలాంటి సమయంలో.. బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ రాజీనామా చేయడం చర్చగా మారింది..
1977లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు ప్రారంభించి యూత్ కాంగ్రెస్ ఇంచార్జిగా పనిచేసిన ప్రకాష్ జైన్.. 1982 లో టీడీపీలో చేరారు . 1983లో జైన్ టీడీపీ తరపున శాసనసభ సభ్యునిగా పోటీ చేసి ఏపీ మరియు దక్షిణ భారతదేశం నుండి జైన సంఘం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995-2004 వరకు కర్నూలు జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు . 2004లో ఆదోని టౌన్ హమాలీ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.. ఆదోని టౌన్ హమాలీ సంఘం అధ్యక్షునిగా ఎన్నికై 40 ఏళ్ల పాటు సేవలందించారు. ఆదోని పట్టణంలోని రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ సంఘం అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు.. ఇక, 2014లో బీజేపీలో చేరారు.. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉండగా.. ఇప్పుడు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. మరి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారా? మరో పార్టీలో చేరతారా? అనే విషయం వేచిచూడాలి..