తెల్లదొరలను సైరా అంటూ వణికించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జన్మించిన పౌరుషాల గడ్డ.. బనగానపల్లె. తరాలు మారినా.. రాజ్యాలు అంతరించినా.. ఇప్పటికే అదే పంతం.. అదే పౌరుషం. ఇక్కడ ఎన్నికలు సైతం రణరంగాన్ని తలపిస్తుంటాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విజయకేతనం ఎరగువేయగా.. ఈసారి మాత్రం ఎన్నికల కురుక్షేత్రంలో దూసుకుసోతున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి. సరిగ్గా ఎన్నికలకు ముందు.. అమ్ముల పొదిలోని అస్త్రాలను తీసి సంధిస్తూ, ప్రత్యర్థుల కోటలను బద్ధలు కొడుతున్నారు. బీసీజేఆర్ దూకుడుతో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిలో ఓటమి భయం మొదలైందా.. ఈసారి అరుంధతీ కోటపై టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని అంటున్నారు. మరో 20 రోజుల్లో ఏపీ సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో స్వల్ఫతేడాతో ఓటమి పాలైనా.. నిత్యం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి అదను చూసి సింహంలా జూలు విదిల్చారు. వరుసగా వైసీపీ నాయకులను సైకెలెక్కిస్తూ ప్రత్యర్థి కాటపాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ కోడుతున్నారు.
ఎన్నికలకు గత కొంత కాలంగా సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ చేసిన బీసీ జనార్థన్ రెడ్డి సరిగ్గా ఎన్నికల కోడ్ వచ్చాక అదను చూసి వైసీపీని చావుదెబ్బ కొట్టారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంత గ్రామం అయిన తమ్మడపల్లెలో తొలిసారిగా బీసీ జనార్థన్ రెడ్డి పాగా వేసారు. గత 20 ఏళ్లుగా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి నమ్మిన బంటుల్లాగా ఉంటున్న 20 మంది ముఖ్య అనుచరులు బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. కాటసాని రామిరెడ్డి వ్యవహారశైలి, అతడి కుమారుడు ఓబుల్ రెడ్డి పెత్తనం భరించలేని ముఖ్య అనుచరులు అదీ సొంత గ్రామంలోని కీలక వైసీపీ నేతలు ఈసారి బీసీ జనార్థన్ రెడ్డిని గెలిపించి తీరుతామని శపథం చేశారు. ఇక వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న కొలిమిగుండ్ల మండలంలో ఇప్పుడు వైసీపీ పూర్తిగా ఖాళీ అయింది..ఇప్పటికే వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బీసీ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కొలిమిగుండ్ల మండలం కేంద్రంతో పాటు, ఎర్రగుడి గ్రామంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డికి వాల్మీకి కులస్థులు మద్దతు పలికారు. ఈ మేరకు బీసీ సమక్షంలో వాల్మీకీ సామాజికవర్గానికి చెందిన దాదాపు 300 కుటుంబాలు సైకిలెక్కడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ పడినట్లైంది. అలాగే అంకిరెడ్డిపల్లిలో ఏకంగా 250 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కుటుంబాలతో సహా బీసీ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా.. గిద్దలూరు గ్రామానికి చెందన వైసీపీ కీలక నేతలతో సహా దాదాపు 50 కుటుంబాలు ఫ్యాన్ పార్టీని వీడి సైకిలెక్కేసారు. మీర్జాపురం గ్రామంలో 15 మంది యువకులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా వైసీపీని వీడి.. బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా సైకిలెక్కేసారు. ఎన్నికల ముందు వెల్లువెత్తుతున్న చేరికలతో టీడీపీలో కదనోత్సాహం నెలకొనగా…ఊరూరా వైసీపీ తుడిచి పెట్టుకుపోతుండడంతో ఫ్యాన్ పార్టీ పరేషాన్‌లో పడింది. ఈ వలసలను ఎలా ఆపాలో తెలియక కాటసాని రామిరెడ్డి తలపట్టుకు కూర్చున్నాడు. మొత్తంగా ఈసారి బనగానపల్లె కోటపై బీసీ జనార్థన్ రెడ్డి పసుపు జెండా ఎగరవేయడం ఖాయమని తెలుగుతమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.