సీఎం జగన్ లాభాపేక్షకు విద్యారంగం నాశనమైందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కేఎస్ జవహర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీచర్లను లిక్కర్ షాపుల వద్ద నిలబెట్టినప్పుడే విద్యారంగంపై జగన్ చిత్తశుద్ధేమిటో అర్థమైందని ఆయన మండిపడ్డారు. నూతన విద్యావిధానం అంటూ ఎవరిని సంప్రదించి సీఎం నిర్ణయాలు తీసుకున్నారు..? అని ఆయన ప్రశ్నించారు.
మంత్రులంతా వేలి ముద్రగాళ్లు అవ్వబట్టే, రాష్ట్రంలో విద్య వ్యాపారాంశమైందని, చంద్రబాబు బడ్జెట్లో 15శాతం నిధులు విద్యకు కేటాయిస్తే, జగన్ వచ్చాక 10శాతం కూడా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పిల్లలే విదేశాల్లో చదవాలా..? దళితులు చదవకూడదా? అని ఆయన అన్నారు. చంద్రబాబు ఎప్పటికప్పుడు డీఎస్సీతో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేశారని, జగన్ 3వేల పాఠశాలలు మూసేసి, 25 వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీని విస్మరించారన్నారు.
ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన జీతాన్ని వాలంటీర్లకిస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, విద్య ద్వారా దళితులు అభివృద్ధి చెందడం ఈ సీఎంకు సుతరామూ ఇష్టం లేదని ఆయన ధ్వజమెత్తారు. నాడు-నేడుతో జగన్ సాధించింది పాఠశాలలకు రంగులద్దడమేనని, చంద్రబాబు పాఠశాలల్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచితే, జగన్ గ్రామాలకు పాఠశాలల్ని దూరం చేశారన్నారు.
రాష్ట్రంలో 490కు పైగా మున్సిపల్ పాఠశాలల్ని ఎందుకు మూసేశారన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్ని జగన్ రెడ్డి నిజంగానే డెడ్ చేశారని ఎద్దేవా చేశారు. అమ్మ ఒడిని బోగస్ గా మార్చారని, ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలల్ని కాపాడుకోవడానికి రోడ్డెక్కాల్సిన సమయం వచ్చిందన్నారు.
