Venkaiah Naidu: విపక్షాలపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయని, రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయాలతో ముడిపెట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు… కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు..
ఓట్ల తొలగింపుపై ఆరోపణలు సరికాదు
ఓట్లను మూకుమ్మడిగా తొలగించారనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆ విజయాన్ని తమ ఘనతగా చెప్పుకోవడం, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలను నిందించడం హాస్యాస్పదమని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో వాటిని తెలియజేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని తెలిపారు. అయితే, ఆ నిరసనలు హింసాత్మకంగా మారకూడదని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో లోటుపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఏపీలో ఎమ్మెల్యేల తీరుపైనా వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ఎమ్మెల్యేలు తామే సర్వాధికారులమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అధికారుల బదిలీల విషయంలో తమ అధికారాన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు తమ పాత్రను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఇక, ఎమ్మెల్యేల ప్రధాన బాధ్యతల్లో అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే బిల్లుల ఆమోదానికి చొరవ చూపడం కూడా ముఖ్యమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తమ అధికారాలను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలని ఆయన అభిప్రాయపడ్డారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.

