YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..

Youtuber Rama Nandana

Youtuber Rama Nandana

YouTuber Rama Nandana: విజయవాడలో సంచలనం రేపిన వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమా నందన పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రమా నందనను పోలీసులు విచారిస్తున్నారు. విదేశాల్లో వీసా, ఉద్యోగం ఇప్పిస్తామంటూ రమా నందన, ఆమె భర్తతో కలిసి 13 లక్షల రూపాయలు వసూలు చేశారంటూ క్రాంతికుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న రమా నందనకు… కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పోలీసుల నోటీసుల మేరకు ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు.

అయితే రమా నందన పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు కార్లలో న్యాయవాదులతో కలిసి ఆమె స్టేషన్‌లోని సీఐ కార్యాలయం వరకు వెళ్లడం… స్టేషన్ గుమ్మం ముందు కారు నిలిపి ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు… స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులతో రమా నందన తరఫు న్యాయవాదులు వాగ్వాదానికి దిగటం చర్చగా మారింది. యూ ట్యూబర్ రమా నందనకు పోలీసులు రాచ మర్యాదలు చేయటంపై విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని రెండు కార్లను స్టేషన్‌ నుంచి బయటకు పంపించారు.