NTV Telugu Site icon

Kolagatla Veerabhadra: సీఎం జగన్ చెప్పినట్లు.. 175 స్థానాలకు 175 గెలిచి తీరుతాం

Untitled 1

Untitled 1

Kolagatla Veerabhadra Swamy Counters On Lokesh Padayatra: తమ నాయకుడు సీఎం జగన్ చెప్పినట్టు.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలిచి తీరుతామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ట వీరభ్రద స్వామి ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయిన నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ఆసియాలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు విశాఖ రాజధానిని స్వాగతిస్తున్నారన్నారు. విశాఖ రాజధాని రాష్ట్రానికి తలమానికంగా మారుతుందని, మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

‘Writer Padmabhushan’: శివరాజ్ కుమార్ అభినందనలు అందుకున్న రైటర్!

ఇదే సమయంలో లోకేష్ చేపట్టిన పాదయాత్రపై వీరభద్ర విమర్శలు ఎక్కుపెట్టారు. లోకేష్ పాదయాత్రకు సొంత జిల్లాలోనే ఆమోదం లభించడం లేదన్నారు. నాడు వైఎస్ఆర్ పాదయాత్రకు, ఇప్పటి లోకేష్ పాదయాత్రకు చాలా తేడా ఉందన్నారు. లోకేష్ యాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారంటూ అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, దీనిని వైఎస్సార్ పార్టీ తరపున ఖండిస్తున్నామని అన్నారు. టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మరా బాబు కార్యక్రమాలకు ప్రజాదరణ కరువైందన్నారు. నాడు చంద్రబాబు పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర అనివార్యమని, అది ప్రజా పాదయాత్రగా సాగిందని తెలిపారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు జనాదరణ లేదన్నారు. విభజన సమయం నుంచి లోటు బడ్జెట్‌లో నడుస్తోందన్న ఆయన.. గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అప్పు అయినా తీర్చారా? అని టీడీపీని నిలదీశారు. ప్రభుత్వం నుంచి నేరుగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు.

Kim : నీ క్రూరత్వం చాలదా.. నీ బిడ్డ కూడానా..?

నిరు పేదలకు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేయడమే సైకోనా? మంచి పనులు చేస్తున్న తమ నాయకుల్ని సైకో అంటున్నారని ప్రతిపక్షాలకు వీరభద్ర కౌంటర్ ఇచ్చారు. అసలు వీళ్లకు సైకో అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సభలకు, ప్రచారాలకు జనాలు వెళ్లారు కానీ ఓట్లు మాత్రం వేయలేదని ఎద్దేవా చేశారు. శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారినా.. వైసీపీకి ఎలాంటి నష్టం లేదని తేల్చి చెప్పారు. అచ్చెన్నాయుడు వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదని.. ఆ పార్టీ, అక్కడి నాయకుల మీద నమ్మకం లేదని అన్నారు. అచెన్నాయుడే లోకేష్ పాదయాత్ర ఆడియో రిలీజ్ చేశారన్న విషయం చంద్రబాబుకు తెలుసన్నారు. ప్రజలకు తాము ఇది చేస్తామని హామీ ఇవ్వలేక తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు.