Kodali Nani Comments On Amaravati Farmers And 3 Capitals: వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. దసరా సందర్భంగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి అమ్మవారి ఆశీస్సులు దక్కాలని మొక్కుకున్నట్టుగా తెలిపారు. హైదరాబాద్‌ను కోల్పోయి తామంతా అనాథలమయ్యామని.. శ్రమంతా కేవలం అమరావతిపైనే పెడితే, మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆ దుస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రలు ఉన్నాయని.. ఆ ప్రాంతాల ప్రజల కోసమే సీఎం వైఎస్ జగన్ ఎంతో ఆలోచించి, మూడు రాజధానులు నిర్మించాలని డిసైడ్ అయ్యారని కొడాలి నాని తెలిపారు. ఇదే సమయంలో.. అమరావతి ఉద్యమాన్ని తప్పుపట్టారు. ఆ ఉద్యమాన్ని ప్రజలతో పాటు దేవుళ్లు కూడా హర్షించరని వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీల కోసమో కాకుండా… రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకూడదన్న భావనతోనే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర సంపదను ఒకే చోట పెడితే.. ప్రాంతీయ విద్వేషాలు తప్పకుండా వస్తాయని కొడాలి నాని పేర్కొన్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు మహా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే! ఈ యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజవకర్గంలోకి ప్రవేశించగా.. అక్కడ ఫ్లెక్సీల వార్ నెలకొంది. కొందరు ఈ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేయగా.. మరికొందరు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టారు. అటు.. అమరావతికి అనుకూలంగా విపక్ష పార్టీలు గుళ్లలో పూజలు చేస్తుండగా, అందుకు కౌంటర్‌గా వైసీపీ శ్రేణులు వికేంద్రీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.