ఏపీలో వైసీపీ పాలనపై మండిపడ్డారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఆత్మకూరులో బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం, అప్పుల మీదే పరిపాలన జరుగుతుంది. అవగాహనా రాహిత్యంతో పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్సీపీ ఒక ప్రైవేట్ కంపెనీ అన్నారు.
మోడీ 130 సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిస్తే జగన్ కేవలం నవరత్నాల పేరిట స్టిక్కర్ మార్చుకొని పరిపాలన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. బీజేపీ కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. అథోగతి పరిపాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. నరేంద్ర మోడీ అన్నీ ఆలోచించే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారు. కొన్ని విద్రోహశక్తులు విధ్వంసం సృష్టించాయని మండిపడ్డారు.
బీజేపీ నేత చందు సాంబశివరావు మాట్లాడుతూ.. ఆర్మీలో రిక్రూట్ మెంట్ చేసుకోవడం ఈ రోజే కొత్త కాదు. దేశ జనాభా ప్రాతిపదికన యువతకు అవకాశం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.సైనిక దళాల్లో ఖాళీల భర్తీ కోసం అగ్ని పథ్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.యేడాదికి 40-50వేల మందిని తీసుకుని యువతకు అవకాశం కల్పించాలని భావించారు.
నాలుగేళ్ళ తర్వాత 25శాతాన్ని సైన్యంలోకి తీసుకుని.. మిగతా 75 శాతాన్ని ఇతర భద్రతా విభాగాల్లో ప్రైవేటుగా సేవలు వినియోగించాలని నిర్ణయించారు.ఈ విధానం పలు దేశాల్లో ఇప్పటికే అమలవుతుంది.నాలుగేళ్ల తర్వాత కూడా మిలటరీలోని పని చేస్తామని పట్టుదల ఉన్నవారిని ఎంపిక చేస్తారు.అగ్నిపథ్ కింద ఎంపికైన వారికి నెల జీతం కింద నాలుగేళ్లకు రూ. 7.50 లక్షలు.. బయటకు వచ్చే సమయంలో మరో రూ. 12లక్షలు ఇవ్వనున్నారు.
అగ్ని పథ్ పధకాన్ని విమర్శించడానికి సరైన కారణాలు ఏమీ లేవు.మోడీ నేతృత్వంలో చేసిన మంచి ఆలోచనను అల్లర్లు ప్రేరేపించే విధంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.సికింద్రాబాదులో ఈరోజు జరిగిన విధ్వంసం వెనుక ఎవరున్నారో త్వరలోనే తెలుస్తుంది.నాలుగు రోజులుగా ప్లాన్ చేసి అల్లర్లు ప్రేరేపించేవిధంగా చేసిన కుట్రలో భాగమే ఈ విధ్వంసం అన్నారు చందు సాంబశివరావు. అంతమంది యువకులు వచ్చి ఒకేసారి యుద్దవాతావరణం సృష్టించారు.
వారి వెనుక ఎవరో ఉండి ప్రోత్సహించబట్టే.. ఇంత అలజడి జరిగింది. 23 సంవత్సరాలకు వయో పరిమితి పెంచాక ఎవరికీ అభ్యంతరాలు లేవు ..? ఆందోళనకారులకు అసలు వాస్తవాలు కూడా తెలియవు. కొన్ని పార్టీల నేతలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించారు. రైళ్లను తగులబెట్టి.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు.
నిజంగా సైన్యంలో చేరాలనుకునే యువత ఎవరూ ఇలాంటి దాడులు చేయరు. యువత ముసుగులో రైల్వేస్టేషన్లో గందరగోళం సృష్టించిన వారి వివరాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి.కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలుంటే తెలపడానికి అనేక మార్గాలు ఉన్నాయి.ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేస్తే.. ప్రజలపైనే భారం పడుతుంది.యువత సంయమనంతో ఉండండి.. తొందరపాటు చర్యలకు పాల్పడవద్దన్నారు.
