తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణమస్తు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. కల్యాణమస్తు కార్యక్రమాన్ని ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఆగస్టు 7న ఉదయం 8:07 గంటల నుంచి 8:17 గంటల మధ్య 26 జిల్లాల్లో కల్యాణమస్తు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సామూహిక వివాహ మహోత్సవంలో వధూవరులు ఒక్కటయ్యేందుకు జూలై 1 నుంచి 20 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
తిరుపతి శ్వేత భవనంలో కల్యాణమస్తు కేంద్రీకృత కార్యాలయాన్ని బుధవారం ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. వివాహం అనేది చాలా ఖర్చుతో కూడుకుందని.. అయితే స్వామివారి ఆశీస్సులతో పేదలకు ఉచితంగా వివాహం జరిపించేందుకు కల్యాణమస్తు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా ఒకటయ్యే వధూవరులకు 2 గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెళ్లి వస్త్రాలు, వధువు నుంచి 20 మంది, వరుడి నుంచి 20 మందికి ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కల్యాణమస్తు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక కో అర్డినేటర్‌ను నియమించి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్‌డీవోలతో సమన్వయం చేస్తామని పేర్కొన్నారు.