Site icon NTV Telugu

Kala Venkata Rao : అప్పుడు వాతలు.. ఇప్పుడు కోతలు..

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్‌ నేత కళా వెంకట్రావ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో విద్యుత్ ధరలు పెంచి వాతలు పెట్టిన జగన్ సర్కార్ ఇప్పుడు కోతలు కూడా మొదలు పెట్టిందని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కరెంట్ ఉండడం లేదని, ఇంకా వేసవి రాకముందే విద్యుత్ కోతలు మొదలైపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 26 వేల కోట్లకు పైగా అప్పులు.. ఛార్జీలు పెంచడం ద్వారా రూ. 11 వేల కోట్ల రాబడి ప్రభుత్వానికి వస్తోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం ఆ నిధులను వినియోగించుకోవడం లేదని, ఇన్ని డబ్బులు వచ్చినా విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారని ఆయన విమర్శించారు.

గ్రామ పంచాయతీల ఖాతాల నుంచి తీసేసుకున్న రూ. 23 వేల కోట్ల నిధులను ఏయే డిస్కంలకు ఎంతెంత ఇచ్చారు..? అని ఆయన ప్రశ్నించారు. హిందూజా దగ్గర తక్కువ ధరకు విద్యుత్ లభిస్తోంటే.. ఓపెన్ మార్కెట్టులో ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటీ..? విద్యుత్ కొనుగోళ్ల వెనుకున్న చిదంబర రహస్యమేంటీ..? అని ఆయన అన్నారు. పరనింద పక్కన పెట్టి ఎలా పని చేయాలో సీఎం జగన్ తెలుసుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు.

Exit mobile version