మనదేశం మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనం. పండుగ ఏదైనా.. ఉగాది అయినా, రంజాన్ అయినా, క్రిస్ట్ మస్ అయినా,, ప్రజలంతా సమైక్యంగా జరుపుకుంటారు. హిందువులకు ముస్లింలు శుభాకాంక్షలు చెబుతారు. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవిస్తారు. హిందూ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని దేవుని కడప దేవాలయానికి విశిష్ట స్థానం ఉంది. అక్కడ తెలుగు వారి తొలి పండుగ ఉగాది పర్వదినాన్ని హిందువులే కాదు.. ముస్లింలు కూడా ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. శ్రీనివాసునికి కాయ కర్పూరం సమర్పించి, ఇక్కడి పూజారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇందుకోసం ముస్లింలు స్వామివారిని దర్శించుకోవడం దేవుని కడపలో ఉగాది పండుగ ప్రత్యేకత.
Read Also: Afghanistan Earthquake: ఆఫ్ఘన్, పాక్‌లలో 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..
ఉగాది పండుగను కడపలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఉగాది రోజున తిరుమల తొలి గడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి, కానుకలు సమర్పించడం ఇక్కడి ముస్లింలకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఉదయాన్నే దేవుని కడప ఆలయానికి చేరుకుని, కాయకర్పూరం సమర్పించి, ముడుపులు సమర్పించారు ముస్లిం భక్తులు. ఉగాది రోజున వేంకటేశ్వరుడిని దర్శించి, ఆలయ పూజారికి బియ్యం బేడలు సమర్పించి, ఆశీర్వాదం తీసుకుంటే ఈ ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి ముస్లింల విశ్వాసం. అందుకే క్రమం తప్పకుండా దేవుని కడపను ముస్లింలు ఉగాది రోజున సందర్శించి మత సామరస్యాన్ని చాటుతున్నారు.
చూసేవారికి కొత్తగా అనిపించినా, తమ బీబీ నాంచారమ్మను శ్రీనివాసుడు పరిణయం చేసుకున్నాడరన్న కారణంతో కడప ముస్లింలు మాత్రం అత్యంత భక్తితో, ప్రీతి పాత్రంగా ఉగాదిని జరుపుకుంటున్నారు. ఏ ఏడాదైనా ఉగాదిని ఇలా జరుపుకోవడం సాధ్యం కాకపోతే ఇబ్బందులు పడ్డామని, కొందరు ముస్లింలు చెబుతున్నారు. తమ పూర్వీకుల నుంచి ఈ సాంప్రదాయం వస్తోంది. పెద్దలు చేసినట్లే తాము ఇప్పుడు గుడికి వచ్చి ఉగాదిని జరుపుకుంటామని చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఆలయం మతసామరస్యాన్ని చాటుచెబుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Read Also: 2023 Ugadi Panchanga Sravanam Live: డా.శంకరమంచి రామకృష్ణ శాస్త్రిగారి ఉగాది పంచాంగ శ్రవణం