నేడు ఏపీలో బీజేపీ జాతీయ అధ్యుడు జేపీ నడ్డా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న జేపీ నడ్డా మాట్లాడుతూ.. మోడీ పొలిటికల్ కల్చర్ మార్చారని, దేశంలో మరే ఇతర జాతీయ పార్టీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత బీజేపీ పోరాటం కుటుంబ పార్టీలతోనేనని, బాప్-బేటా పార్టీలతోనే చాలా రాష్ట్రాల్లో పోరాడుతున్నామని ఆయన వెల్లడించారు. ఏపీలోనూ వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలే.. వాళ్లతోనే మన పోరాటమని, తెలంగాణలోనూ కుటుంబ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీతోనే పోరాటమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదు.. అన్నా చెల్లెళ్ల పార్టీని ఆయన సెటైర్లు వేశారు. విజయవాడ నుంచే బీజేపీ విజయం ఢంకా మోగించాలని ఆయన బీజేపీ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు.
విజయవాడ అర్జునుడి తపస్సు చేసిన పుణ్య భూమి అని, విజయవాడ సాంస్కృతిక రాజధాని అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటింటికి బీజేపీ నేతలు.. కార్యకర్తలు వెళ్లాలి.. ఏపీలో రాజకీయాన్ని మార్చాలని ఆయన సూచించారు. ఏపీలోని 46 వేల పోలింగ్ బూత్ లలో ప్రభావితం చూపాలని, శక్తి కేంద్ర ప్రముఖులదే కీలక పాత్ర అని ఆయన తెలిపారు. కొత్త కార్యకర్తలను చేర్చుకోవాలని, ప్రతి వర్గానికి చెందిన వాళ్లు కొత్తగా కార్యకర్తలు చేరాలన్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల చేరికలను ప్రోత్సహించాలన్న నడ్డా.. నెల రోజుల్లోపు చేరికలపై ఫోకస్ పెట్టాలన్నారు. బూత్ స్థాయిలో సమస్యలు ఏమున్నాయి..? కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా..? లేదా..? అనేది చూడాలని సూచించారు. కేంద్ర నిధులతో లబ్ది పొందితే ఆ విషయం చెప్పాలని, జగన్ అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ కేంద్ర నిధులతోనే అమలు చేస్తున్నారని చెప్పాలని ఆయన అన్నారు.