Site icon NTV Telugu

Jogi Ramesh: పవన్ చేష్టలు వింతగా ఉన్నాయి.. ఎక్కడ పోటీ చేయాలో చూసుకో

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh Counter Attack On Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ మాటలు, చేష్టలు వింతగా ఉన్నాయన్నారు. ఆయన పరిస్థితి చూస్తుంటే.. జగనన్న ఇల్లు, పవన్ – చంద్రబాబు కన్నీళ్లు లాగా ఉందని ఎద్దేవా చేశారు. ఇకపై ఈ ట్యాగ్ పెట్టుకోవడమే బెటరని హితవు పలికారు. విజయనగరం వెళ్లి పవన్ అసలు ఏం చేసినట్టు? అని ప్రశ్నించారు. వీకెండ్‌లో గెస్ట్ ఆర్టిస్టుగా వచ్చి.. ప్రభుత్వాన్ని తిట్టి వెళ్లాడని అన్నారు. 21 లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుండటం చూసి.. పవన్‌కి కడుపుమంట అని మండిపడ్డారు. గుంకలాంలో కూడా 12 వేల ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే.. ఏమీ జరగనట్టు పవన్ చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లుంటే, సరిగా చూస్తే, ఆ ఇళ్ల నిర్మాణం కనిపిస్తుందని ధ్వజమెత్తారు.

2014లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పారని.. మరి ఒక్క ఇల్లైనా ఎందుకు కట్టించలేదు? సెంటు స్థలం కూడా ఎందుకు ఇవ్వలేదు? అని జోగి రమేశ్ ప్రశ్నించారు. ఆరోజు చంద్రబాబు చొక్కా పట్టుకుని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు. పిల్ల సైకోలను పోగేసుకుని వచ్చి.. గుంకలాంలో మీటింగ్ పెట్టారని సెటైర్లు వేశారు. లబ్ధిదారులు తిరగపడితే, ఈ పిల్ల సైకోలు పరుగెత్తుతున్నారని ఫైర్ అయ్యారు. జనాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ పారిపోవటం తప్ప ఇక ఏం చేస్తున్నావ్? అని పవన్‌ని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం ఏ రాష్ట్రంలోనూ జరగటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వమే శభాష్ అని మెచ్చుకున్నదన్న విషయం తెలుసుకోలని పవన్‌ని సూచించారు. మనసున్న ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని.. ‘గడపగడపకూ ప్రభుత్వం’ కార్యక్రమానికి వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారో, మెచ్చుకుంటున్నారో తెలుస్తుందని చెప్పారు. పవన్, ఆయన దత్తతండ్రి కలిసొచ్చినా.. ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని సవాల్ విసిరారు. రాక్షసులు, దుర్మార్గులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

అసలు ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారో.. నువ్వు ఎక్కడెక్కడ పోటీ చేయాలో చూసుకో అని పవన్‌ని జోగి రమేశ్ సూచించారు. గెలుస్తావో లేదో చూసుకో అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకే ఎక్కడ పోటీ చేయాలో అర్థం కావడం లేదని.. ఇక దత్తపుత్రుడు, సొంత పుత్రుడుకి ఎక్కడ సీట్లు ఇస్తాడో చూడాలని అన్నారు. లోకేష్ మోకాళ్లతో నడిచినా.. మీరు చేసిన పాపాలు పోవన్నారు. మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేశారని.. 2024లో చంద్రబాబు, లోకేష్, పవన్ ఎవరూ అసెంబ్లీలో అడుగు పెట్టలేరని జోస్యం చెప్పారు. అసలు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదన్నారు. ఏనాడైనా ప్రజల ఓట్లతో లోకేష్ గెలుపొందారా? తండ్రి పడేసిన పదవులతో లోకేష్ రాజకీయ చేశారని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలకు జగన్ న్యాయం చేస్తున్నారని.. ఇక ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తావ్ లోకేష్? అని జోగి రమేశ్ ప్రశ్నించారు.

Exit mobile version