NTV Telugu Site icon

Jc Vs Palle: జేసీపై మండిపడుతున్న పల్లె

Palle1

Palle1

అయాచితంగా ఓనేతపై చేసిన విమర్శలకు కొంత కాలంగా ఆయన ఫలితం అనుభవిస్తున్నాడు. అత్యంత సౌమ్యుడు… వివాదరహితుడుగా పేరుపొందిన ఆ విద్యావేత్తను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వదల బొమ్మాలి అన్న రీతి లో సదరు నేత వెంటపడుతుండడం ఇబ్బందికరంగా మారింది. భూ వివాదాలు… రాజకీయంగానే కాకుండా వ్యాపార లావాదేవీల అంతు తేలుస్తా అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా టీడీపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి మధ్య ముదిరిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.

అనంతపురం టీడీపీలో జేసీ ఫ్యామిలీ, పల్లె రఘునాథరెడ్డిల స్టైలే వేరు. దశాబ్దాలుగా రాజకీయాలు నేర్పిన అనుభవం ఉంది. ఇద్దరి మధ్య కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు క్యాడర్ ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. కొంత కాలంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.తనకు సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ పల్లె ప్రశ్నిస్తుంటే … కార్యకర్తలలో భరోసా నింపడానికే తనూ వెళ్లానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు.

ఒక ప్రైవేటు స్థలంలో సాగుతున్న వివాదం. ఇప్పుడు అనంత టీడీపీలో కలకలం రేపుతోంది. ఆ అక్రమాలు నిగ్గు తేల్చుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి బయలు దేరితే అదే పార్టీకి చెందిన పల్లె రఘునాథరెడ్డి దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల పుట్టపర్తిలోని రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..ఇదే కరెక్ట్ టైం అని అక్కడికి బయలు దేరారు.పుట్టపర్తిలో ఉజ్వల విల్లాల విక్రయంలో అవకతవకలు జరిగాయని కలెక్టర్, ఎస్పీ, పుడా వైస్ చైర్మన్ ను కలిసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి బయలుదేరారు. పుట్టపర్తిలో ఉన్న సమస్య విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి జోక్యం ఏంటన్నది మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అభ్యంతరం.

ఇప్పటికే తనకు వ్యతిరేకంగా వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారని.. నాకు టికెట్ కూడా ఇవ్వకూడదని జేసీ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుని జేసీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడం ఉద్రికత్తలకు దారి తీసింది. ముందు నుంచి ఉన్న వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. గతంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని.. ఒక వేళ అలా కాదని ఇస్తే.. ఖచ్చితంగా ఓటమి ఖాయమని.. అంతే కాదు చంద్రబాబు కూడా ఓడిపోతారని జేసీ స్పష్టం చేశారు. పల్లెకు టిక్కెట్టు ఇస్తే ఓటింగ్ తగ్గుతుందని.. మచ్చలు ఉన్న వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి అని.. కొత్త వ్యక్తికి ఇవ్వాలంటూ తన మనసులోనే మాట చెప్పకనే చెప్పేశారు. దీనికి పల్లె రఘునాథ్ రెడ్డి సైతం అలానే రియాక్ట్ అయ్యారు. అసలు నువ్వెవరు ఇవన్నీ చెప్పడానికి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచావ్… నేను మూడుసార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రి అయ్యాను, చీఫ్ విప్ అయ్యాను.. ఈ సారి బీఫారం తీసుకుంటున్నానని జేసీ పై విరుచుకుపడ్డారు.

వైసీపీ పెద్దారెడ్డితో పాటు పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలతో కలిసి బిజినెస్ వ్యవహారాలు నడుపుతున్నారంటూ జేసీ గత కొంత కాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో రెండు సార్లు నియోజకవర్గం పర్యటించిన జేసీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విషయాలు పల్లెకు ఇబ్బందికరంగా మారాయి.తనకు సరిపోని వర్గం జేసీ పంచన చేరి నియోజకవర్గ రాజకీయాల్లో ఇంఛార్జికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని పల్లె ఆరోపిస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య ముందు నుంచి ఎలాంటి వివాదాలు లేకపోయినా… కొంత కాలంగా సొంత పార్టీలో నేతలిద్దరూ బద్ధ శత్రువులుగా మారారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం …సవాళ్లు …ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. అధిష్టానం ఇద్దరి మధ్య నెలకొన్న వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో అని క్యాడర్ ఎదురుచూస్తోంది.

Anikumar Yadav: మీలా దిగజారుడు రాజకీయం మాది కాదు