NTV Telugu Site icon

JC Prabhakar Reddy: రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మహిళా కలెక్టర్‌కు వార్నింగ్

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీతో దురుసుగా ప్రవర్తించారు. కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని.. ఇలా అయితే స్పందన కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ కలెక్టర్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కలెక్టర్ ముందు పేపర్లు విసిరేసి బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్‌గా పనికిరావంటూ దుర్భాషలాడారు. జిల్లా కలెక్టర్ తనను బయటకు వెళ్లమని చెప్పడం ఏంటని జేసీ ప్రభాకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన సమస్యే పట్టించుకోకపోతే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తేనే పట్టించుకోరా.. టీడీపీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడం తప్పా అని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Vidadala Rajini: త్వరలోనే ఎయిమ్స్‌లో కూడా ఆరోగ్యశ్రీ ప్రవేశపెడతాం

కలెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించే సమయంలో గన్‌మెన్ వారించినా జేసీ ప్రభాకర్‌రెడ్డి వినిపించుకోలేదు. కాగా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో రూ.70 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై 2021 జనవరిలో కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే భూఅక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేస్తే ఒక్కరోజులో సమస్యను పరిష్కరించారని, తన ఫిర్యాదుపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈ భూ వ్యవహారంలో కలెక్టర్‌కు ఏమైనా సంబంధం ఉందా అని నిలదీశారు. కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి పోతుంటే ప్రశ్నించకూడదా అంటూ మండిపడ్డారు.

Show comments