జేసీ బ్రదర్స్ అంటేనే సంచలన వ్యాఖ్యలకు మారుపేరు.. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తుంటారు.. అయితే, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆగ్రహానికి గురైన ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష కూడా ఖరారు అయ్యింది.. క్షమాపణలు చెప్పడంతో ఆ శిక్షలను సేవగా మార్చేసింది హైకోర్టు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సహా అందరూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్న ఆయన.. పరిపాలించే నాయకులు సరిగా లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని. సలహాదారులలో చాలా మందికి చదువుకు కూడా రాదని.. అధికారులను కేవలం సంతకాల కోసం మాత్రమే వాడుకుంటున్నారని.. సంతకాలు పెట్టకపోతే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలుసని.. చీఫ్ సెక్రెటరీ, డీజీపీ ఏమయ్యారో చూశామని వ్యాఖ్యానించారు.
Read Also: Hyderabad Metro Rail: స్పీడ్ పెరిగింది.. మరింత త్వరగా గమ్యానికి..
ఉద్యోగస్తులు అంతమంది ఉండి ఆందోళన చేసినా ఏమీ చేయలేకపోయారు.. ఇక, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఏం చేయగలరిన ఆవేదన వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కోర్టులు మా లాంటి వాళ్లకు దేవాలయాలు.. న్యాయమూర్తిలే దేవుళ్లు.. కానీ, పైన కోర్టులో ఆదేశాలు ఇచ్చినప్పటికీ కిందిస్థాయిలో అవి అమలు కావడం లేదని.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం క్షేత్రస్థాయిలో ఆ విధంగా ఉందని విమర్శించారు.. అయితే, కోర్టులు ఈ విషయాలపై దృష్టి సారించాలని కోరారు.. కోర్టు తీర్పు అమలు చేయని కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని.. కోర్టు తీర్పులు క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.