ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఏపీలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎక్కడికక్కడ నిరసనలు తెలపడంతో పాటు, రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 5న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నట్లు పార్టీ ప్రకటించింది.
ఈ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. మరోవైపు పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, విభాగాల ఛైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కోర్డినేటర్లు, అధికార ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వ పాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, రైతులు వ్యవసాయ స్థితిగతులు వంటి తదితర అంశాలపై పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు.
https://ntvtelugu.com/minister-botsa-satyanarayana-clarity-on-zilla-parishad-division/
