ఏపీలో జనసేన పార్టీ మరో నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేసేందుకు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈనెల 15, 16, 17 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జనసేన చేపట్టనున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ మేరకు తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఆయన డిజిటల్ క్యాంపెయిన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణంగా ఉన్న రహదారులను కనీస మరమ్మతులు కూడా ప్రభుత్వం నిర్వహించడం లేదని ఆరోపించారు. గాఢనిద్రలో ఉన్న సీఎం జగన్‌ను నిద్ర లేపేందుకు #GoodMorningCMSir కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఫోటోలు, వీడియోలు స్వయంగా ఆయన డిజిటల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారని వివరించారు.
మరోవైపు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో ఏపీలో రహదారుల దుస్థితిపై జనసేన వీర మహిళలు నాయకులు, జన సైనికులు ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తారన్నారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గ్రామాలు, మండలాల్లో రహదారుల దుస్థితిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రోడ్డు మరమ్మతుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు మళ్లించేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు. పెట్రోల్ మీద ఏటా సామాన్యుడి నుంచి రూ.750 కోట్లు రోడ్ సెస్ వసూలు చేస్తున్నారని.. ఆ సెస్ చూపి రూ. 6 వేల కోట్లు అప్పులు తెచ్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి జవాబుదారీతనం ఉంటే ఆ నిధులు ఎందుకు ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను జనసేన పార్టీ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు.
#GoodMorningCMSir హ్యష్ టాగ్ తో ఈ నెల 15,16,17 తేదీలలో రహదారుల దుస్థితి పై డిజిటల్ ప్రచారం. pic.twitter.com/3NXXMNq6xg
— JanaSena Party (@JanaSenaParty) July 12, 2022