NTV Telugu Site icon

Pawan Kalyan Tour in Kadapa: సీఎం ఇలాకాలో పర్యటనకు సిద్ధమైన పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan

Pawan Kalyan

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన జనసేనాని.. బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ సారి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇలాకాలో పర్యటించనున్నారు పవన్‌ కల్యాణ్.. జనసేనాని కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 20న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చెప్పున ఆర్థిక సాయం చేయనున్నారు పవన్‌. రాజంపేట నియోజకవర్గలో జరిగే రచ్చబండలో పాల్గొని రైతు కుటుంబాల ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర పూర్తయింది.

Read Also: Godavari at Bhadrachalam: ఉగ్రరూపం దాల్చిన గోదా‌వరి.. 54.3 అడు‌గు‌లకు నీటి మట్టం

రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొననున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు చాలా సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా ఉంది.. అన్ని పార్టీలు తమ కార్యాచరణపై దృష్టి పెట్టాయి.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు.. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో అన్ని గ్రామాలను చుట్టేసేపనిలో ఉంటే.. ప్రతిపక్షాలు కూడా అదేస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నాయి.. బాదుడే బాదుడు పేరుతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కార్యక్రమాలు చేస్తుంటే.. పవన్‌ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు.. బీజేపీ కూడా వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.