Site icon NTV Telugu

Pawan Kalyan: జనసేన ఆవిర్భావ సభ ద్వారా బలమైన సందేశం పంపిస్తా

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం పరిధిలో ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. జనసేన పార్టీ స్థాపించి 8 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహించే ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. సభలో వీరమహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జనసైనికులకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో… ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారో ఈ సభ ద్వారా వివరిస్తామని పేర్కొన్నారు. భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే మెరుగైన భవిష్యత్ అందించగలం అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటు సభకు వచ్చేవారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని పవన్ ఆరోపించారు. సభకు వెళ్లడం తమ హక్కు అని ప్రతి జనసేన కార్యకర్త చాటిచెప్పాలన్నారు. పోలీసులు కూడా తమకు సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. గతంలో తమపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ, సందేహాలు వ్యక్తం చేసినవారికి రేపు సభాముఖంగా సమాధానం చెప్తానన్నారు.

Exit mobile version